17 జులై, 2012

ఇళ్లలో దోచి 8 మంది బాయ్‌ఫ్రెండ్స్‌తో పనిమనిషి జల్సా




ముంబై: పని చేస్తున్న ఇళ్లలోనే చోరీ చేస్తూ, బాయ్ ఫ్రెండ్స్‌తో జల్సా చేస్తున్న 26 ఏళ్ల యువతిని ఓషివారా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం ఆమెను అనితా శైలేంద్ర గైక్వాడ్‌గా గుర్తించారు. పోలీసులు ఈమెను గత శనివారం అరెస్టు చేశారు. ముంబయి నగరంలోని వివిధ ప్రాంతాలలో తాను పని చేసిన పదమూడు ఇళ్లలో దొంగతనం చేసింది. అనితగా కాకుండా ఆయా ప్రాంతాలలో వేర్వేరు పేర్లతో చలామణి అయింది.

పని చేస్తానని చేరి పదమూడు ఇళ్లను దోచుకోవడమే కాకుండా తనకున్న ఎనిమిది మంది బాయ్‌ఫ్రెండ్స్‌తో జల్సా చేసేది ఈ అనిత శైలేంద్ర గైక్వాడ్ అనే పనిమనిషి. ముంబైలోని వివిధ ప్రాంతాల్లో సవిత, సంగీత, సుమన్, లక్ష్మి వంటి వేర్వేరు పేర్లతో చేరిన మొదటి రోజే విలువైన వస్తువులతో అనిత పరారయ్యేది.

ఓషివారా పోలీస్ స్టేషన్ పరిధిలోనే జూన్ 19న, జూలై 4న రెండు ఇళ్లలో పది లక్షల రూపాయల విలువైన నగలు చోరీ చేసిందని ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఎవరింట్లో పనిమనిషి అవసరం ఉందో అని అక్కడి వాచ్‌మెన్‌ల ద్వారా అనిత తెలుసుకునేది.

ఆ ఇంటికి వెళ్లి పని చేస్తానని యజమానులతో మాట్లాడుకుని చేరిన మొదటిరోజే అందుబాటులో ఉన్న విలువైన వస్తువులను చేజిక్కించుకొని పరారయ్యేదని పోలీసులు తెలిపారు. వాటిని తన ప్రాంతంలోని వ్యాపారుల వద్ద తాకట్టు పెట్టి తీసుకున్న డబ్బును తనకున్న ఎనిమిది మంది బాయ్‌ఫ్రెండ్స్‌తో జల్సా చేసేదట. అయితే ఒక ఇంటి నుంచి వస్తున్న అనితను అక్కడి సిసి టివి ఫుటేజ్‌ల ద్వారా పోలీసులు గమనించారు.

దాంతో గతంలో ఆమెపై గల కేసుల ఆధారంతో అనితను గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు ఆమె వద్ద నుంచి అయిదు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దోపిడీల్లో ఆమెకు ఆ ఎనిమిది మంది బాయ్‌ఫ్రెండ్స్ సహకరించారా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కామెంట్‌లు లేవు: