18 జులై, 2012

ప్రధాన కార్యదర్శిగా బాలకృష్ణ? లేదంటే కొత్తగా..


















నందమూరి హీరో బాలయ్య బాబు తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టనున్నారా అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, టిడిపిలో ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరిస్తానని బాలకృష్ణ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో కూడా పదవి పైన మాట్లాడినట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను బాలయ్య కొట్టి పారేశారు.

తాను ఏ పదవిని కోరలేదని, అవసరమైతే సామాన్య కార్యకర్తగా కూడా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే ఏ బాధ్యత తీసుకొని ప్రజల్లోకి వెళ్లాలనే అంశంపై త్వరలోనే ఓ నిర్ణయానికి రానున్నారని తెలుస్తోంది. ప్రజల్లోకి వెళ్లేందుకు, నేతలతో మాట్లాడేందుకు ఎలాంటి బాధ్యతను తీసుకోవాలనే దానిపై వారం పది రోజుల్లో ఓ నిర్ణయం తీసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది.

పదవిపై మరోసారి బాబుతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో పార్టీలో చంద్రబాబు నిర్వహించిన ప్రధాన కార్యదర్శి పదవిని బాలయ్య తీసుకోవచ్చునని అంటున్నారు. పోలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా బాధ్యతలు తీసుకోవచ్చునని చెబుతున్నారు. ఇప్పటికే పార్టీలో ఉన్న పదవులు తీసుకుంటారా లేదంటే కొత్తగా బాలయ్య కోసం ఏదైనా బాధ్యతలున్న పదవిని తెరపైకి తీసుకు వస్తారా అనేది తెలియాల్సి ఉంది.

దీనిపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోందని అంటున్నారు. పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్లాలని, ఎన్నికలతో సంబంధం లేకుండా పర్యటనలు చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారని తెలుస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికలలో బాలయ్య పోటీకి సిద్ధమవుతున్నారు. ఆయితే ఎక్కడి నుండి పోటీ చేసేది ఇంకా ఖరారు కాలేదు. ఆయన పదవితో పాటు పోటీ విషయమై కూడా చర్చ జరుగుతోందని అంటున్నారు.

గుడివాడ నుండి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే పెనమలూరు, హిందూపురంలలో ఏదో ఒక స్థానం నుండి కూడా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. పార్లమెంటుకు పోటీ చేయాలని అనుకుంటే కూడా కొన్ని స్థానాల పేర్లు టిడిపి పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. అయితే బాలయ్య రాష్ట్ర రాజకీయాలలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి శాసనసభ నియోజకవర్గం పైనే టిడిపి ప్రధానంగా దృష్టి సారిస్తోందని అంటున్నారు.

కామెంట్‌లు లేవు: