4 జులై, 2012

జగన్ సోదరి షర్మిలకు కౌంటర్‌గా లోకేష్ భార్య బ్రాహ్మణి



















సోమవారం టిడిపి నేత దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీకి బిసిలకు దూరమయిందని, వారిని మళ్లీ దరి చేర్చుకునే విధంగా ముందుకు వెళతామని చెప్పారు. అందులో భాగంగా పార్టీలోని పలువురు నేతలు యువతను, ఇతరులను ఆకట్టుకోవడానికి హీరో నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లతో పాటు నారా లోకేష్ కుమార్‌ను రంగంలోకి దింపాలని బాబుపై తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విషయానికి వస్తే జగన్ సోదరి షర్మిల ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ఉప ఎన్నికల ప్రచారంలో అది నిరూపితమైంది. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వలే ఉన్న షర్మిల హావభావాలు, ప్రతిపక్షాలపై ఆమె చేసిన విమర్శల తీరు ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థుల గెలుపుకు షర్మిల ప్రచారం ఎక్కువగా దోహదపడింది.

షర్మిలను గమనించిన తెలుగు తమ్ముళ్లు బాలకృష్ణ తనయ, నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణిని రంగంలోకి దింపితే బాగుంటుందని ప్రతిపాదన బాబు ముందుకు తీసుకు వస్తున్నారని అంటున్నారు. బ్రాహ్మణిని పార్టీకి ఉపయోగించుకుంటే షర్మిల కంటే మంచి స్పందన కనిపిస్తుందని తమ్ముళ్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారట. ఇటీవల అనంతపురం జిల్లా నేతలు పలువురు బాబును కలిసి బ్రాహ్మణి పేరును ముందుకు తెచ్చారట.

బ్రాహ్మణి రంగంలోకి దిగితే కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం ఖాయమని, స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవరాలిగా, బాలకృష్ణ తనయుగా ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పడతారని సూచిస్తున్నారట. బ్రాహ్మణి పైన ప్రస్తుతం కేంద్రమంత్రి, అత్త అయిన దగ్గుపాటి పురంధేశ్వరి ప్రభావం ఎక్కువగా ఉంటుందట. మరి ఆమె దారిలోనే బ్రాహ్మణి కూడా రాజకీయ ఆరంగేట్రం చేస్తే పురంధేశ్వరి ఎలా స్పందిస్తారు, టిడిపికి ఎంత లబ్ధి చేకూరుతుందో తెలుస్తుంది.

కామెంట్‌లు లేవు: