హైదరాబాద్: గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని ఇచ్చిన షాక్ నుంచి
తేరుకోకముందే తెలుగుదేశం పార్టీకి మరో దెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీ
పోలిట్‌బ్యూరో సభ్యురాలు, దళిత నేత ఉప్పులేటి కల్పన వైయస్ జగన్
నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ విస్తృత స్థాయి
సమావేశంలో బిజీగా ఉన్న సమయంలో కల్పన మంగళవారం సాయంత్రం వైయస్సార్
కాంగ్రెసు పార్టీ నేత, పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డిని
కలిశారు.
మేకపాటి రాజమోహన్ రెడ్డిని కలిసినట్లు నిర్ధారణ కావడంతో
కల్పనను తెలుగుదేశం పార్టీ మంగళవారం రాత్రి సస్పెండ్ చేస్తూ నిర్ణయం
తీసుకుంది. ఆమె గత రెండు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి
ఓడిపోయారు. తొలుత నిడుమోలు నుంచి, ఆ తర్వాత 2009లో పామర్రు నుంచి పోటీ
చేశారు. వరుసగా రెండు సార్లు ఓడిపోయినప్పటికీ కల్పనను చంద్రబాబు పార్టీ
పోలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు. పామర్రు పార్టీ ఇంచార్జీగా కూడా
కొనసాగిస్తున్నారు.
కాగా, కొడాలి నానిపై చంద్రబాబు నాయుడు చేసిన
వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నూజివీడు శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్య
వ్యతిరేకించారు. చంద్రబాబు వ్యాఖ్యలు అప్రజాస్వామికమని ఆయన అన్నారు. పార్టీ
అధినేతగా చంద్రబాబు అసంతృప్తితో ఉన్న నాయకులతో మాట్లాడి, పరిస్థితులను
చక్కదిద్దాల్సి ఉంటుందని, దురదృష్టవశాత్తు చంద్రబాబు ఆ విషయంలో
విఫలమయ్యారని ఆయన అన్నారు.
చాలా కాలంగా చిన్నం రామకోటయ్య పార్టీ
అధినేత చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్నారు. ఆయన కూడా వైయస్ జగన్ పార్టీలో
చేరుతారనే ప్రచారం జరిగింది. అయితే, చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత ఆయన
వెనక్కి తగ్గారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు.
దాంతో కాంగ్రెసు వైపు చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఆయన
ఖండించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి