16 జులై, 2012

సిఎం అనలేదు కానీ: జానా, కిరణ్‌పై తెరాస రివర్స్ గేర్













హైదరాబాద్: తాను ముఖ్యమంత్రిని అవుతానని ఎప్పుడూ చెప్పలేదని, ప్రజలు మాత్రమే అనుకున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి శుక్రవారం అన్నారు. ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టి పారేశారు. ప్రభుత్వం ప్రస్తుతం నిర్వహించబోయే ఇందిరమ్మ బాట కార్యక్రమం కొత్తది కాదన్నారు. తాను ప్రత్యేక తెలంగాణ రావాలని ప్రగాఢంగా ఆకాంక్షిస్తున్నానని చెప్పారు.

తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారో తనకు తెలియదని, ఆయన ఏమన్నారో తెలియకుండా మాట్లాడలేనని చెప్పారు. అయితే తెలంగాణ ఇస్తేనే దేశానికి ఉపయోగమని మాత్రం చెప్పగలనని అన్నారు. తమ పార్టీ అధిష్టానం తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఊహించని పరిణామాలు ఎన్నో జరిగాయని, తెలంగాణ విషయంలో కూడా అలా జరుగవచ్చునని అన్నారు.

తెలంగాణపై అధిష్టానానికి సదభిప్రాయం ఉందన్నారు. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించక పోవడంతో కేంద్రం నుండి గత సంవత్సరం రావాల్సిన రూ.458 కోట్లు, ఈ సంవత్సరం రూ.1500 కోట్లు విడుదల కాలేదన్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి సిఎం కిరణ్ కుమార్ రెడ్డిపై రివర్స్ గేర్ వేసింది. సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావుతో సహా పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కిరణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, సిఎం ఇందిర బాటను తెలంగాణలో అడ్డుకోబోమని చెప్పారు. కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాలలో పెంచినట్లుగా మహాత్మా గాంధీ హాస్పిటల్‌లో కూడా సీట్లు పెంచాలని కిరణ్‌ను కోరినట్లు చెప్పారు.

తెలంగాణకు వంద సీట్లు పెరగడం తెరాస సాధించిన విజయం అన్నారు. హైకోర్టు ఆదేశాలను వెంటనే అమలుపర్చాలని కోరారు. మెడికల్ సీట్లపై తప్పుడు నిర్ణయాలు తీసుకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. నీటి విడుదలపై తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, టిడిపి మాట్లాడటం లేదన్నారు. గ్రామాల్లో విద్యుత్ కోత తగ్గించాలన్నారు. తెలంగాణ మా జన్మ హక్కు అయితే అభివృద్ధి మా పౌర హక్కు అని హరీష్ రావు చెప్పారు. అయితే ఇటీవలి వరకు కిరణ్‌ను అడ్డుకుంటామని చెప్పిన తెరాస ఇప్పుడు అడ్డుకోమని చెప్పడం గమనార్హం.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

జానా రెడ్డి సారు ముక్యమెంత్రి అవ్వాలని హిందూపురం, కుప్పంల నుండి ఇచ్చాపురం, అదిలాబాదు వరకూ అనుకుంటున్న మాట వాస్తవమే. :D మంచి చరిస్మా వున్న నాయకుడు, పరిణితి చెందిన నిస్వార్థ ప్రజాసేవకుడు, స్తేట్స్‌మన్ కూడా... మరి పెజలు ఆశపడతారంటే, పడరూ?!

"అనుకున్నామని జరగవు అన్ని
అనుకోలెదని ఆగవు కొన్ని"