24 జులై, 2012

మోక్షజ్ఞ సినీ రంగప్రవేశం గురించి బాలకృష్ణ

























హైదరాబాద్: మా అబ్బాయి మోక్షజ్ఞ కచ్చితంగా హీరో అవుతాడు. అయితే వేరే దారి లేక కాదు. తనకు సినిమాలంటే ఇంట్రస్ట్ ఉంది. అప్పట్లో నన్ను నాన్నగారు బలవంతంగా సినిమాల్లోకి నెట్టలేదు. నా ఆసక్తి గమనించి ప్రోత్సహించారు. ఇప్పుడు నేనూ అంతే అంటూ తన కుమారుడు సినీ ప్రవేశం గురించి మీడియాకు తెలియచేసారు బాలకృష్ణ. ఆయన తన తాజా చిత్రం ఊ కొడతారా...ఉలిక్కి పడతారా ప్రమేషన్ లో భాగంగా మీడియాతో ముచ్చటించారు.

అలాగే మల్టీస్టారర్ చిత్రాల గురించి మాట్లాడుతూ... ‘ఊ కొడతారా..' మల్టీస్టారర్ కిందే లెక్క. నేను, మనోజ్, శివాజీగారి అబ్బాయి ప్రభు, సుహాసిని, లక్ష్మీప్రసన్న, సోనూసూద్... ఇలా చాలామంది యాక్ట్ చేశాం. మల్టీస్టారర్ సినిమాలు చేసేయాలనే ఆరాటంతో చేయడం కరెక్ట్ కాదు. కథ, పాత్రలు సరిగ్గా కుదిరినప్పుడే చెయ్యాలి. నాన్నగారు, నాగేశ్వరరావుగారు కలిసి ఎన్నో సినిమాలు చేశారు. అయితే వాటిలో కొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఆ సినిమాలు చూసినప్పుడు ఎందుకు చేశారా? అనిపిస్తుంది. అందుకని మంచి కథ, పాత్ర కుదిరితేనే మల్టీస్టారర్ చేస్తాను అన్నారు.

‘ఊ కొడతారా..' చిత్రంపై ప్యాన్స్ ఎక్సపెక్టేషన్స్ గురించి చెపుతూ...ఈ సినిమా గురించి విన్న తర్వాత అభిమానులు ఊ... అనే విధంగా స్పందించారు. ఇందులో నటించడం అంత అవసరమా? అని కూడా అనుకున్నారు. ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను. కాబట్టి సినిమా చూసేటప్పుడు ముందు ఉలిక్కిపడి ఆ తర్వాత బలంగా ఊ అంటారు. అభిమానులే కాదు, ప్రేక్షకులందరికీ నచ్చుతుంది అని చెప్పారు.

స్టార్ హీరోగా ఓ హోదా లో ఉంటూ ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా'లో కీలక పాత్ర చేయడానికి గల కారణం వివరిస్తూ...ఇందులో నేను చేసినది వైవిధ్యభరితమైన పాత్ర. ఈ కథ, పాత్ర నచ్చడంవల్ల చేశాను. ఈ రోల్‌ని ఎంజాయ్ చేస్తూ చేశాను. మామూలుగా నేను ఒక పాత్రను సొంతం చేసుకున్న తర్వాత, అందులోకి పూర్తిగా ఒదిగిపోతాను. ఈ చిత్రంలోని పాత్రలో కూడా అలాగే మౌల్డ్ అయ్యాను. ఇది మంచి పాత్ర కాబట్టి నటుడిగా పూర్తి సంతృప్తి లభించిందని మాత్రం చెప్పను. ఎన్ని వందల పాత్రలు చేసినా కళాకారులకు సంతృప్తి అనేది లభించదు అన్నారు.

బాలకృష్ణ ముఖ్య పాత్రలో మనోజ్, దీక్షాసేథ్ హీరోహీరోయిన్లుగా శేఖర్‌రాజా దర్శకత్వంలో మంచు లక్ష్మీప్రసన్న నిర్మించిన ‘ఊ కొడతారా... ఉలిక్కిపడతారా' ఈ నెల 27న విడుదల కానుంది. బాలకృష్ణ, ప్రభు, మనోజ్, దీక్షాసేథ్, లక్ష్మీ ప్రసన్న, సోనూసూద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈచిత్రానికి సంగీతం బెబో శశి.

కామెంట్‌లు లేవు: