4 జులై, 2012

జగన్‌నే ఎందుకు టార్గెట్ చేశారు: పిఎంతో విజయమ్మ

















న్యూఢిల్లీ: తమ పార్టీ అధ్యక్షుడు, తన కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఒక్కడినే ఎందుకు సిబిఐ టార్గెట్ చేసిందని తాను ప్రధాని మన్మోహన్ సింగ్‌ను అడిగినట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చెప్పారు. మన్మోహన్ సింగ్‌ను, జెడి (యు) అధ్యక్షుడు శరద్ యాదవ్‌ను తన ప్రతినిధి బృందంతో కలిసిన తర్వాత వైయస్ విజయమ్మ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడిగా జగన్ పుట్టడమే తప్పా అని ఆమె అడిగారు. తమ కుటుంబం పట్ల సిబిఐ అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని ప్రధానికి వివరించినట్లు ఆమె తెలిపారు.
వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రశంసించారని, వైయస్ రాజశేఖర రెడ్డిని రోల్ మోడల్‌గా చెప్పారని, అటువంటి వైయస్ రాజశేఖర రెడ్డి పేరును ఎఫ్ఐఆర్‌లో ఎందుకు చేర్చారని ఆమె చెప్పారు. పారిశ్రామికాభివృద్ధి మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా వైయస్ రాజశేఖర రెడ్డి వ్యవహరించరాని, గత ప్రభుత్వాల మాదిరిగానే వ్యవహరించారని ఆమె చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ అయిన 26 జీవోలు తప్పని మంత్రులు గానీ అధికారులు గానీ చెప్పగలరా అని ఆమె ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర రెడ్డి చేసింది తప్పని ప్రభుత్వం చెప్పగలదా అని ఆమె అడిగారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలతో జగన్‌కు సంబంధం ఏమిటని ఆమె అడిగారు. అప్పుడు వైయస్ జగన్ పార్లమెంటు సభ్యుడు గానీ శానససభ్యుడు గానీ కారని, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి కూడా వెళ్లలేదని, బెంగళూర్‌లో వ్యాపారం చేసుకుంటున్నారని ఆమె అన్నారు. శంకరరావు ఫిర్యాదులో జగన్‌ను 52వ ప్రతివాదిగా చేరిస్తే కేసులో సిబిఐ మొదటి ముద్దాయిగా ఎలా చేర్చిందని ఆమె అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డిని తప్పు పడుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ప్రభుత్వం ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ఆమె అడిగారు.

వైయస్ జగన్ కేసులో అతి వేగంగా కదిలిన సిబిఐ ఇతరుల మీద ఇలాగే చేస్తోందా అని ఆమె అడిగారు. సిబిఐ అక్రమాలను ప్రధానికి వివరించినట్లు ఆమె తెలిపారు. పార్టీ అధ్యక్షుడు, ఎంపి అయిన జగన్‌ను కక్షతోనే ఉప ఎన్నికలకు ముందు సిబిఐ అరెస్టు చేసిందని ఆమె విమర్శించారు. విచారణలో అన్ని విషయాలు జగన్ చెప్పినా చెప్పలేదంటూ సిబిఐ బుకాయిస్తోందని ఆమె అననారు. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారందరినీ ప్రభుత్వం భయబ్రాంతులకు గురి చేస్తోందని ఆమె విమర్శించారు. ఏ నాయకుడిమీదనైనా ఇలా చేశారా ఆమె అడిగారు.

మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని తాను ప్రధానిని కోరినట్లు ఆమె తెలిపారు. సిబిఐ జెడి లక్ష్మినారాయణపై ప్రధానికి ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. లక్ష్మినారాయణ ఎల్లో మీడియాకు ఎందుకు సమాచారం లీక్ చేస్తున్నారని ఆమె అడిగారు. జగన్‌కు సరైన భద్రత కల్పించడం లేదని ఆమె అన్నారు. జెడి కాల్ లిస్టు విషయంలో సాక్షి చెప్పిందంటూ విచారణ జరుపుతున్నారని, జెడిపై ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ఆమె అన్నారు. జగన్ కేసు విషయంలో సిబిఐ రెండు వేల మంది ఫోన్‌లను ట్యాప్ చేసిందని, అయినా ఏమీ రాబట్టలేకపోయిందని ఆయన ఆమె అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కలిసి పని చేసినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఓడించలేకపోయారని, ప్రజాకోర్టులో జగన్ నిర్దోషిగా తేలాడని ఆమె అన్నారు.

రైతు సమస్యలను జాతీయ నాయకులకు, ప్రధానికి తెలియజేయడానికి తాము ఢిల్లీ వచ్చామని ఆమె చెప్పారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్ల రైతులు కష్టాలు పడుతున్నారని, వైయస్ ఇచ్చిన భరోసా ప్రస్తుత ప్రభుత్వం రైతులకు ఇవ్వలేకపోతోందని ఆమె విమర్శించారు. కరెంట్ సరఫరా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు. విత్తనాలు, ఎరువులు అందడం లేదని, రుణాలు కూడా రైతులకు సరిగా అందడం లేదని ఆమె అన్నారు. రైతులు పడుతున్న కష్టాలను ప్రధానికి వివరించారమని ఆమె చెప్పారు. ప్రధానికి తాము చెప్పిందంతా సావధానంగా విన్నారని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆమె అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని తాము ప్రధానిని కోరినట్లు వైయస్ విజయమ్మ చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తనను కలిశారని, తనకు కొన్ని దస్తావేజులు ఇచ్చారని జెడి (యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ చెప్పారు. దస్తావేజులను పరిశీలించిన తర్వాత వీలైతే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి సాయం చేయడానికి ప్రయత్నిస్తామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. వైయస్ విజయమ్మ వెంట మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎంవి మైసురా రెడ్డి, శోభానాగిరెడ్డి, సుచరిత తదితరులు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.

కామెంట్‌లు లేవు: