హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ అధిష్టానం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ
అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్
రెడ్డిలు తమ సత్తా నిరూపించుకునేందుకు మరో అవకాశం ఇచ్చినట్లుగా
కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ
అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ధాటికి
కాంగ్రెసు ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.
ఉప ఎన్నికలకు ముందు
అధిష్టానం బొత్స, కిరణ్‌లకు హెచ్చరికలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
ఫలితాలు కాంగ్రెసుకు అనుకూలంగా రాకుంటే వారిద్దరిని తొలగిస్తారనే ప్రచారం
జరిగింది. ఉప ఎన్నికలలో కాంగ్రెసు ఘోర వైఫల్యం చెందడంతో నాయకత్వ మార్పు
జరుగుతుందనే ఊహాగానాలు వినిపించాయి. నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో రాష్ట్ర
నేతలు అధిష్టానం పెద్దలను కలిసేందుకు క్యూ కట్టారు. ఢిల్లీలో అంతా హడావుడి
కనిపించింది.
నాయకత్వ మార్పు కోసమే ఇదంతా జరుగుతున్నట్లుగా ప్రచారం
జరిగింది. అయితే నాయకుల నుండి తీసుకున్న అభిప్రాయాలు, పార్టీ ఫలితాలు, గత
అనుభవాలు తదితరాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం బొత్స, కిరణ్‌లను
కొనసాగించేందుకే అధిష్టానం మొగ్గు చూపినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
ఇప్పట్లో వారిని మార్చకూడదనే గట్టి నిర్ణయానికి పార్టీ పెద్దలు
వచ్చినట్లుగా తెలుస్తోంది. సానుభూతి తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్న
పెద్దలు ఓటమికి వారిని బాధ్యులను చేస్తూనే సత్తా నిరూపించుకునేందుకు మరో
అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.
పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంలో బొత్స,
పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో కిరణ్ విఫలమయ్యారనే అభిప్రాయానికి
అధిష్టానం వచ్చిందని అంటున్నారు. అయితే కాంగ్రెసు నిత్యం ముఖ్యమంత్రులను
మార్చుతుందనే ఆరోపణల ఉండటంతో పాటు తెలంగాణ సమస్య ఉన్న ప్రస్తుత సమయంలో
మార్పు అంశాన్ని పక్కకు పెట్టడమే మంచిదని పెద్దలు భావించారని అంటున్నారు.
అందుకే 2014 వరకు పార్టీని బలోపంతే చేయాలనే లక్ష్యాన్ని వారి ముందు పెట్టి
వారినే కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
అంతేకాకుండా
ఇప్పటికే గ్రూపు తగాదాలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మార్పులు చేస్తే మొదటికే
మోసం వస్తుందని భావించారని అంటున్నారు. పార్టీ, ప్రభుత్వ నాయకత్వాల్లో
మార్పులు లేకున్నప్పటికీ స్థానికంగా మార్పులు చాలా అవసరమని భావిస్తున్నారని
అంటున్నారు. నామినేటెడ్ పదవులు త్వరగా భర్తీ చేసి ఉత్సాహం నింపాలని కిరణ్
భావిస్తున్నారు. అదే సమయంలో బొత్స కూడా జిల్లా స్థాయిలోని పార్టీ కమిటీలలో
భారీగా మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారట.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి