14 జులై, 2012

బాబు 'బిసి'పై జగన్ సాక్షి కథనం: యనమల కౌంటర్


















హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దిన పత్రికపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బిసిలకు ఇటీవల ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని సాక్షి విమర్శలు గుప్పిస్తూ ఓ కథనం రాసింది. దీనిపై యనమల స్పందించారు.

బిసిల న్యాయపరమైన డిమాండ్లను తీర్చాలని 9వ తేదిన టిడిపి డిక్లరేషన్ చేసిందని చెప్పారు. బిసి డిక్లరేషన్‌ను అవహేళన చేసే హక్కు ఏ పార్టీకి లేదన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు డిక్లరేషన్ పైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతనే బిసిలకు సరియైన న్యాయం జరిగిందన్నారు. దానిపై ఎవరితోనైనా ఎలాంటి చర్చకైనా సిద్ధమని సవాల్ చేశారు.

టిడిపి ప్రకటించిన డిక్లరేషన్ పైన సాక్షి కథనం బిసిలను కించపర్చేలా ఉందని విమర్శించారు. సెజ్‌ల పేరుతో ఆ వర్గాన్ని బిచ్చగాళ్లను చేశారని మండిపడ్డారు. బిసి రిజర్వేషన్‌లను తగ్గించింది దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డియే అన్నారు. కాంగ్రెసు హయాంలో బిసిల కోసం ప్రవేశ పెట్టిన కొత్త పథకం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు బిసిలకు ఏమీ చేయలేదన్నారు.

వైయస్సార్ సెజ్‌లలో నష్టపోయింది బిసిలే అన్నారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మత్స్యకారులను వారి వృత్తికి దూరం చేసిందని ఆరోపించారు. ఆదరణ పథకం మొదలైంది టిడిపి హయాంలోనేనని, వైయస్ ప్రభుత్వం దానిని నిలిపి వేసిందన్నారు. కాగా వరంగల్ జిల్లా తెలంగాణ బిసి ఐకాస నేతలు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును కలిశారు. టిడిపి నిర్ణయాల పట్ల కృతజ్ఢతలు తెలిపారు. మిగతా పార్టీలు టిడిపిని విమర్శించడం మాని వారు కూడా బిసిలకు ప్రత్యేక పాలసీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

కామెంట్‌లు లేవు: