17 జులై, 2012

ఆన్‌లైన్ పేరుతో మోసం: బోర్డు తిప్పేసిన సిటీ ఫెసిలిటీ



















హైదరాబాద్/విజయవాడ: ఆన్‌లైన్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పిసేన సిటీ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సంస్థ పైన సిసిఎస్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ సంస్థ ముషీరాబాదులో ఉంది. ఈ సంస్థకు గుంటూరు, విజయవాడలలో కూడా బ్రాంచులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సుమారు వంద కోట్ల రూపాయలను నిరుద్యోగుల నుండి వసూలు చేసి ఈ సంస్థ యాజమాన్యం బోర్డు తిప్పేసి ఉంటుందని అనుమానిస్తున్నారు.

కొన్ని గంటల పాటు పని చేస్తే వేలాది రూపాయలు సంపాదించవచ్చునని ఇచ్చిన ప్రకటనకు ఆకర్షితులైన వేలాది మంది నిరుద్యోగులు ఈ సంస్థలో దరఖాస్తు పెట్టుకున్నారు. దరఖాస్తు సమయంలో వేలాది రూపాయలను డిపాజిట్ల కింద కట్టారు. అందరి వద్ద నుండి డిపాజిట్లు సేకరించిన అనంతరం ఎవరికీ డబ్బులు ఇవ్వకుండానే బోర్డు తిప్పేసింది. దీంతో మంగళవారం బాధితులు ముషీరాబాద్‌లోని కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. రెండురోజులుగా కార్యాలయం తెరవకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు ఆందోళనకు దిగారు. సుమారు 8వేల మంది మోసపోయి ఉంటారని భావిస్తున్నారు.

అనంతరం వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో సిసిఎస్‌లో కేసు నమోదయింది. పోలీసులు సంస్థ యాజమాన్యం కోసం గాలింపు చర్యలకు సిద్ధమవుతోంది. మరోవైపు కృష్ణా జిల్లా గుడివాడలో ఓ చిట్టీల వ్యాపారి ప్రజలకు టోకరా వేశాడు. పట్టణంలోని పంతొమ్మిదవ రోడ్డులో ఓ వ్యక్తి చిట్టీల వ్యాపారం పేరుతో వసూళ్లు చేసేవాడు.

గత కొంతకాలంగా స్థానికులను నమ్మిస్తూ పెద్ద ఎత్తున వారితో చిట్టీలు వేయించాడు. అందరి నుండి సుమారు రూ.12 లక్షలు సేకరించిన అనంతరం వాటితో ఉడాయించాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిట్టీల వ్యాపారి యజమాని ఇంటి వద్ద బాధితులు ఆందోళనకు దిగారు.

కామెంట్‌లు లేవు: