17 జులై, 2012

తెలంగాణను కొట్టి జగన్ జేబునింపాడు:వైయస్‌పై కెటిఆర్




















హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి రంగారెడ్డి జిల్లా భూములను కొల్లగొట్టి తన తనయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జేబులు నింపాడని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా భూముల వేలాన్ని నిరసిస్తూ కెటిఆర్ ఆధ్వర్యంలో తెరాస తార్నాకలోని హెచ్ఎండిఏ కార్యాలయాన్ని ముట్టడించింది. కార్యకర్తలు కార్యాలయానికి తాళం వేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. తెలంగాణ భూములను ఆంధ్రా వాళ్లకు కట్టబెట్టింది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడేనని, వైయస్ ఈ సంస్కృతిని ఇంకా ముందుకు తీసుకు వెళ్లాడని విమర్శించారు. భూముల వేలం ద్వారా వచ్చిన సొమ్మును వైయస్ ఆంధ్రా నేతలకు కట్టబెట్టాడన్నారు. తెలంగాణ వచ్చాక విచారణ కమిటీ వేసి భూములను స్వాధీనం చేసుకొని తిరిగి రైతులకు అప్పగిస్తామని చెప్పారు.

రంగారెడ్డి పరిధిలోని భూములను వేలం వేయడం ద్వారా వైయస్ ప్రభుత్వం రూ.1700 కోట్లు దండుకుందన్నారు. ఇక్కడి అభివృద్ధికి ఒక్క పైసా ఖర్చు చేయలేదన్నారు. వాటిలో పెద్ద మొత్తంలో జగన్ ఖాతాల్లోకి వెళ్లాయని ఆరోపించారు. ఇక్కడి నుండి వచ్చిన డబ్బుతో జగన్ జేబులు నింపాడన్నారు. ప్రజల ఆస్తులకు ధర్మకర్తలా ఉండాల్సిన హెచ్ఎండిఏ దళారిలా వ్యవహరిస్తోందన్నారు. హెచ్ఎండిఏను ప్రభుత్వం పావులా వాడుకుంటోందన్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా భూముల వేలం పాటను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల నోట్లో హెచ్ఎండియే మట్టికొట్టిందని, వేలంపాట భూములు అన్ని రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతులవి అన్నారు. భూముల వేలంతో సీమాంధ్ర పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు మాత్రమే లబ్ధి పొందారన్నారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మానుకోవాలని హితవు పలికారు. వేలంపాటల ద్వారా ఎవరూ భూములు కొనవద్దని కెటిఆర్ సూచించారు. హైదరాబాదులో ఉన్న ఉద్యోగాలు, భూములు తెలంగాణ వారికే ఇవ్వాలన్నారు.

కామెంట్‌లు లేవు: