4 జులై, 2012

ఢిల్లీలో విజయమ్మ బిజీ బిజీ: ప్రధానితో నేడు భేటీ















న్యూఢిల్లీ: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల సాగుతున్న సీబీఐ దర్యాప్తు తీరుతెన్నులను ప్రధానమంత్రికి వివరించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలో పలువురు నేతలు మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు. బుధవారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసి వినతిపత్రం అందజేయనున్నారు. ఆమెకు ప్రధాని అపాయింట్‌మెంట్ లభించింది. అలాగే ఇతర పార్టీల నేతలతోనూ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితోనూ సమావేశం కానున్నారు.

విజయమ్మ వెంట ఎంపీలు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎంపీ ఎంవీ మైసూరారెడ్డి, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, శోభానాగిరెడ్డి తదితరులు ఉన్నారు. ప్రధానిని కలిసేందుకు గతంలోనే అపాయింట్‌మెంట్ కోరిన పార్టీ నేతలు ప్రధాని కార్యాలయ సూచన మేరకు మంగళవారం ఢిల్లీకి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో హస్తినకు చేరుకున్న వీరికిసాయంత్రంలోపు ఎప్పుడైనా అపాయింట్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉందని, అందుబాటులో ఉండాల్సిందిగా పీఎంవో వర్గాలు తెలిపాయి. పీఎంవో సూచన మేరకు వైఎస్‌ఆర్‌సీపీ నేతలంతా లోథీరోడ్డులోని జగన్ నివాసంలో ఎదురుచూస్తూ గడిపారు.

సాయంత్రం ఐదుగంటలు దాటాక ప్రధాని ఇతరత్రా సమావేశాల్లో బిజీగా ఉన్నందువల్ల బుధవారం ఉదయం 11.30 గంటలకు అపాయింట్‌మెంట్‌ను ఖరారు చేస్తున్నట్లు పీఎంవో వర్గాలు వారికి సమాచారమిచ్చాయి. కాగా బుధవారం 11 గంటలకు ఎన్డీఏ కన్వీనర్ శరద్‌యాదవ్‌తో, సాయంత్రం 4 గంటలకు సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్ధన్‌తో విజయమ్మ భేటీ కానున్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌ను కూడా వైఎస్‌ఆర్ సీపీ నేతలు కలవనున్నారు.

సీబీఐ జగన్ పట్ల కక్షసాధింపు వైఖరిని అవలంబిస్తోందని మాజీ ఎంపీ మైసూరారెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ విమానాశ్రయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. సీబీఐ వైఖరిని ప్రధానికి వివరించడంతో పాటు రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఆయన దృష్టికి తేనున్నట్లు తెలిపారు.

సీబీఐ మాన్యువల్‌లోని నియమనిబంధనలను ఏమాత్రం ఖాతరు చేయకుండా, జగన్‌పై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్న సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. జగన్‌మోహన్‌రెడ్డిని దోషిగా చిత్రీకరించే విధంగా సీబీఐ వ్యవహరిస్తోందన్నారు.

టీడీపీ, కాంగ్రెస్ పార్టీల అభీష్టానికి అనుగుణంగా జగన్‌ను జనం నుంచి దూరం చేసే ధ్యేయంతో సీబీఐ పనిచేస్తోందని చెప్పారు. ఇవ న్నీ ప్రధానికి వివరించి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని కోరనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రధాని దృష్టికి తెస్తామన్నారు. వరికి రూ.1,450 గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరతామని చెప్పారు.

కామెంట్‌లు లేవు: