18 జులై, 2012

సోనియా గాంధీకి క్రాస్ ఓటింగ్ భయం, అందుకే....




















న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే ఆందోళన ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ అంశంపై కొంత మంది తమ పార్టీ పార్లమెంటు సభ్యులు క్రాస్ ఓటింగుకు పాల్పడే అవకాశం ఉందనే అనుమానాలు ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందున ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయకూడదని తెలంగాణ జెఎసి అన్ని పార్టీల తెలంగాణ ప్రతినిధులకు పిలుపునిచ్చింది. పార్టీకి చెందిన వీర తెలంగాణవాదులు ఆ దిశగా ఆలోచన చేస్తే ప్రమాదం ఉంటుందని సోనియా ముందుగానే జాగ్రత్త పడినట్లు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యులతో ఆమె ప్రత్యేకంగా మంగళవారం సమవేశం కావడం వెనక ఆ భయమే ఉందని అంటున్నారు. పార్లమెంటు సభ్యులు ఎలా ఉన్నారు, వారి ఆలోచన ఏ విధంగా ఉందని పరిశీలించడానికి, తాను ప్రత్యేక గుర్తింపు ఇచ్చినట్లు వారిని సంతోషపెట్టడానికి సోనియా రాష్ట్ర పార్లమెంటు సభ్యులతో సమావేశమైనట్లు చెబుతున్నారు. తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యుల్లో రెండు రకాల వాళ్లున్నారు.

పొన్నం ప్రభాకర్, మందా జగన్నాథం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, జి. వివేక్ వంటివారు కాంగ్రెసులో తెలంగాణ విషయంలో అతివాదులు కాగా, సర్వే సత్యనారాయణ, వి. హనుమంతరావు వంటివారు మితవాదులుగా గుర్తింపు పొందారు. తెలంగాణ సాధన కోసం ఎంత దూరమైనా వెళ్తామని పొన్నం ప్రభాకర్ వంటి అతివాద గ్రూపు అంటూ వస్తోంది. సర్వే సత్యనారాయణ, హనుమంతరావు వంటివారు తెలంగాణ కావాలని గట్టిగానే అడుగుతున్నప్పటికీ పార్టీకి పూర్తి విధేయులుగా వ్యవహరిస్తున్నారు.

నిజానికి అతివాదులుగా పేరు పొందినవారు కూడా ఎప్పటికప్పుడు పార్టీకి సహకరిస్తూనే ఉన్నారు. మధ్య మధ్యలో కాస్తా ఇబ్బంది పెట్టినట్లు వ్యవహరిస్తూ మళ్లీ దారికి రావడం వారు ఒక వ్యూహంగానే పెట్టుకున్నారు. 

వారిపై సోనియాకు, ముఖ్యంగా కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ నమ్మకంగానే ఉన్నారని చెబుతారు. అయితే, ఒక్కసారి వారిని పిలిచి మాట్లాడడం ద్వారా వారు సంతృప్తి చెందుతారనే ఉద్దేశంతోనే సోనియా సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. అయితే, ఇతర రాష్ట్రాల పార్లమెంటు సభ్యులతో కూడా మాట్లాడుతూ నమూనా బ్యాలెట్ ఇచ్చి ప్రణబ్ ముఖర్జీ ప్రథమ ప్రాధమ్య ఓటు వేయాలని, రెండో ప్రాధమ్య ఓటు వేయకూడదని చెబుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులకు సోనియా సూచించారు.

కామెంట్‌లు లేవు: