17 జులై, 2012

వైయస్ జగన్ వ్యూహం: ఇక ఆపరేషన్ తెలంగాణ


















హైదరాబాద్: సీమాంధ్రలో ఇటీవలి ఉప ఎన్నికల ద్వారా ఆధిక్యతను చాటుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తెలంగాణపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. చంచల్‌గుడా జైలులోనే ఉంటూ ఆయన వైయస్ విజయమ్మ కార్యక్రమాలను ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ఆయన వ్యూహానికి అనుగుణంగానే వైయస్ విజయమ్మ ప్రజల్లోకి వెళ్తున్నట్లు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చేనేత దీక్ష చేపట్టడం ద్వారా వైయస్ విజయమ్మ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు సవాల్ విసరాలని చూస్తున్నారు.

సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కుమారుడు కెటి రామారావు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కెటిఆర్ కోటలో అడుగు పెట్టడం ద్వారా తెలంగాణలో సత్తా చాటాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కెకె మహేందర్ రెడ్డి సిరిసిల్ల నుంచి పోటీ చేయడానికి తెరాస టికెట్ ఆశించారు. ఆ మేరకు కెసిఆర్ హామీ కూడా ఇచ్చారు. అయితే, కెకె మహేందర్ రెడ్డిని కాదని, తన కుమారుడు కెటి రామరావుకు ఆయన టికెట్ ఇచ్చారు.

తనకు తెరాస టికెట్ లభించకపోవడంతో కెకె మహేందర్ రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డి హామీలతో కాంగ్రెసులోకి వచ్చారు. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చారు. కెటిఆర్‌ను ఢీకొట్టడానికి కెకె మహేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. దీంతోనే సిరిసిల్లలో వైయస్ విజయమ్మ చేనేత దీక్ష చేపట్టినట్లు తెలుస్తోంది. సిరిసిల్లలో దీక్షకు ఆటంకాలు ఎదురు కాకపోతే, అక్కడి దీక్ష విజయవంతమైతే తెలంగాణవ్యాప్తంగా బలోపేతం కావడానికి తిగిన కార్యాచరణను రూపొందించుకోవచ్చుననేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది.

పరకాల ఉప ఎన్నిక ఫలితంతో ఒక రకంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సంతృప్తిగానే ఉంది. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలో చిత్తుగా ఓడిపోవడంతో తెరాసకు తామే దీటైన ప్రత్యామ్నాయ శక్తిగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భావిస్తోంది. తమ పార్టీకి బలమైన నాయకులు ఉన్న నియోజకవర్గాలను గుర్తించి కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణపై స్పష్టమైన వైఖరి ఇచ్చిన తర్వాతనే విజయమ్మ సిరిసిల్లకు రావాలని కెటి రామారావు అంటున్నారు. గతంలో వైయస్ జగన్ వరంగల్ జిల్లా పర్యటనను అడ్డుకున్నట్లే విజయమ్మ సిరిసిల్ల పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీన్ని కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సవాల్‌గానే స్వీకరిస్తోంది. విజయమ్మ దీక్షను విజయవంతం చేయాలనే పట్టుదలతో ఆ పార్టీ వ్యవహరిస్తోంది.

కామెంట్‌లు లేవు: