18 జులై, 2012

కిరణ్ కుమార్ రెడ్డి ఇంటి నుండే మొదలవాలి: విహెచ్


















న్యూఢిల్లీ: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెసు పార్టీ మర్చిపోవాలని అప్పుడే రాష్ట్రంలో పార్టీ నిలదొక్కుకుంటుందని రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు సోమవారం అన్నారు. వైయస్‌ను మర్చిపోవడం మొదట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంటి నుండే మొదలు కావాలని సూచించారు. సిఎం నివాసంలోకి అడుగుపెట్టగానే కుడివైపున నిలువెత్తు వైయస్ చిత్రపటం ఉంటుందని చెప్పారు.

ఈ విధానాలను కాంగ్రెస్ వదులుకోవాలని చెప్పారు. కాగా, ఎంపీల అభిప్రాయాలు తీసుకోవాలన్న మంత్రుల కమిటీ ఆలోచన వల్ల ఫలితం ఉండదని, కార్యకర్తలతో మాట్లాడితేనే ప్రయోజనం ఉంటుందన్నారు. గ్రామ స్థాయి కార్యకర్తలే పార్టీకి వారధి అని, అలాంటి వారిని 2009 నుంచీ ఇప్పటి వరకూ పార్టీ పట్టించుకోలేదని అన్నారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలు చేయటం మంచిదేనని అయితే, అధికారులే అన్ని ఏర్పాట్లూ చేస్తున్నందున కార్యకర్తల మనోభావాలు తెలుసుకునే అవకాశం లేదన్నారు.

ప్రభుత్వ పథకాల గురించి ఆ సభల్లో సీఎం ఎంత చెప్పినా, ప్రజలు మర్చిపోతారని, అదే కార్యకర్తలకు చెబితే వాళ్లు అందరికీ ప్రచారం చేస్తారన్నారు. కార్యకర్తల దగ్గరికి వెళ్తే.. ముందు వాళ్లే తమ ఆవేదన చెబుతారని, తర్వాత వాళ్లే పార్టీ పటిష్టానికి సూచనలు కూడా చేస్తారన్నారు. ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేప్పుడు కార్యకర్తల్ని విశ్వాసంలోకి తీసుకోని పార్టీ ఓటమి తర్వాత అయినా వారిని విశ్వాసంలోకి తీసుకోవాలన్నారు.

తెలుగుదేశం బీసీలకు 100 సీట్లు అంటూ, ప్రతిపక్షాలు కరెంటు సమస్యలు, నీటి సమస్యలు అంటూ ప్రజలతో కలసిపోతుంటే, కాంగ్రెస్ మాత్రం అధికారిక సమావేశాలే తప్ప పార్టీ సమావేశాలు పెట్టకపోవటం సరికాదన్నారు. టీజీ వెంకటేశ్ వ్యాఖ్యలను ప్రస్తావించగా.. పనిచేయని ఐఏఎస్ అధికారుల్ని కాల్చాలని మంత్రి అంటే, పనిచేయని నాయకుల్ని కాల్చాలని పార్టీ కార్యకర్తలు అంటారని, అప్పుడు పార్టీ కానీ, ప్రభుత్వం కానీ మాట్లాడలేవని చెప్పారు.

కాగా, 17వ తేదీన ఎంపీలతో సమావేశమవుతామని మంత్రుల కమిటీ ప్రకటించినప్పటికీ, తాను ఆ సమావేశానికి హాజరు కాలేనని వీహెచ్ చెప్పారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర ఎంపీలతో సోనియాగాంధీ సమావేశమవుతున్నందున, తాను హైదరాబాద్ వెళ్లలేనన్నారు. 18వ తేదీ మధ్యాహ్నం సోనియాగాంధీ విందు ఉన్న నేపథ్యంలో ఆ రోజు కూడా తాను మంత్రుల కమిటీ ముందు హాజరు కాలేనని చెప్పారు.

కామెంట్‌లు లేవు: