హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కంటే హీరో
నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లకు ఆ పార్టీని నడిపించే సామర్థ్యం
ఉందా అనే చర్చ జరుగుతోంది. ఇటీవల నందమూరి - నారా కుటుంబం మధ్య విభేదాలు
అన్న ప్రచారం జోరుగా జరుగుతున్న విషయం తెలిసిందే. కొడాలి నాని జగన్‌కు జై
కొట్టాక జూనియర్ వివరణ ఇవ్వడం, తమకు సంబంధం లేదని హరికృష్ణ చెప్పడంతో అంతా
సమసి పోయిందని భావించారు. కానీ అసలు సమస్య అయిన వారసత్వ పోరు ఇప్పుడు
ప్రారంభమైందని అంటున్నారు.
ప్రస్తుత పరిస్థితులలో చంద్రబాబు కంటే
పార్టీని లీడ్ చేయగల వారు ఎవరూ లేరనే వాదన వినిపిస్తోంది. బాలయ్య ఐనా,
జూనియర్ ఐనా, లోకేష్ ఐనా ఎవరికీ సాధ్యం కాదని అంటున్నారు. పార్టీని
గట్టెక్కించేందుకు నందమూరి కుటుంబం ఖచ్చితంగా అవసరమైనప్పటికీ నాయకత్వం
విషయానికి వస్తే వారు ఎవరూ బాబు కంటే మిన్నగా పార్టీని గట్టెక్కించలేరని
అంటున్నారు. వారిలో నాయకత్వ లక్షణాలు ఇప్పటికైతే కనిపించడం లేదనే వ్యాఖ్యలు
వినిపిస్తున్నాయి. పార్టీ క్లిష్ట పరిస్థితులలో ఉన్న ఇప్పుడు వారంతా
ఒకటిగా కాకపోవడమే కాకుండా వారసత్వ పోరుతో పార్టీకి మరింత నష్టం
చేస్తున్నారని అంటున్నారు.
బాబు నాయకత్వంపై అనుమానాలు వ్యక్తమవుతున్న
ప్రస్తుత దృష్ట్యా బాలయ్య, జూనియర్, హరికృష్ణలను కూడా భేరీజు వేసి
చూస్తున్నారు. బాలకృష్ణ నాయకత్వం విషయంలో తన బావ బాబుకే మద్దతు ఇస్తారు.
ఒకవేళ బాలయ్య పార్టీ పగ్గాలు చేపట్టినా అంత సీన్ లేదని అంటున్నారు. ఆయన
మంచి క్రౌడ్ పుల్లర్. ప్రజల్లో మంచి ఇమేజ్ ఉంది. ఆయన ప్రచారం పార్టీకి
ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే నాయకత్వ లక్షణాలు మాత్రం లేవని అంటున్నారు.
ఆయనకు ప్రధానంగా వాగ్ధాటి లేకపోవడం పెద్ద మైనస్ అంటున్నారు.
ఇక
హరికృష్ణ విషయానికి వస్తే ఆయనకు ఆవేశం తప్ప వ్యూహాత్మకంగా వెళ్లలేరని
అంటున్నారు. పలుసార్లు ఆయన ఆవేశం బయటపడిందని చెబుతున్నారు. అంతేకాదు ఆయన తన
పని తాను చేసుకు పోవడమే కానీ మరొకరి మాట వినరని అంటున్నారు. ఇలాంటి వారు
పార్టీని లీడ్ చేయలేరని అంటున్నారు. పార్టీ శ్రేణులను నడిపించే లక్షణాలు
లేవని అంటున్నారు. అందుకే అన్న తెలుగుదేశం పార్టీ మన్నలేదని చెబుతున్నారు.
జూనియర్ విషయానికి వస్తే ఆయనకు తన తాతలా వాగ్ధాడి ఉందని చెబుతున్నారు.
2009లో ఆయన తాతను తలపించాడని, అలాగే క్రౌడ్ పుల్లర్ అని చెబుతున్నారు.
ఆయనకు
లేనిదల్లా రాజకీయ అనుభవమేనని, అదే ప్రధానమని చెబుతున్నారు. యువకుడు
కాబట్టి ఆవేశంలో వ్యూహాత్మక తప్పిదాలకు కూడా అవకాశం లేకపోలేదని
చెబుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రం పైన, రాష్ట్ర పరిస్థితుల పైన ఏ మాత్రం
అవగాహన లేదంటున్నారు. పార్టీకి ప్రచారం చేయడం తప్ప ఏ ఏ పార్టీలో ఎవరున్నారో
కూడా తెలియకపోవచ్చునని అంటున్నారు. ఉప ఎన్నికల ప్రచారం తర్వాత పార్టీ
వేదికలపై కనిపించింది లేదు. 2010లో ఓసారి మహానాడు కార్యక్రమంలో మాత్రమే
జూనియర్ పాల్గొన్నారు.
ఆయనది పార్టీని నడిపే వయస్సు కూడా
కాదంటున్నారు. ఆయనకు తెలిసిందల్లా తాతయ్య పేరు చెప్పడం ఒక్కటే తెలుసునని
చెబుతున్నారు. బాలయ్య, జూనియర్‌లు క్రౌడ్ పుల్లర్‌లు అయినంత మాత్రాన,
స్వర్గీయ ఎన్టీఆర్ వంశం వారు అయినంత మాత్రాన పార్టీ పగ్గాలు
అప్పజెప్పాల్సిన పని లేదని, పాలన పైన, పార్టీ పైన, రాజకీయ పరిస్థితుల పైన
అవగాహన చాలా ముఖ్యమని అంటున్నారు.
తనకు అత్యంత సన్నిహితుడు అయిన
నానినే లీడ్ చేయలేక పోయినా జూనియర్ పార్టీని ఎలా లీడ్ చేయగలరని అంటున్నారు.
ప్రస్తుత పరిస్థితులలో టిడిపిని లీడ్ చేయగల నేత బాబు తప్ప ఎవరూ లేరని
అంటున్నారు. 2004లో ప్రభుత్వంపై వ్యతిరేకత, 2009లో చిరంజీవి వల్ల
ఓడిపోయిందని, ఇప్పుడు కూడా జగన్ 'సెంటిమెంట్' కారణంగా పార్టీ క్లిష్ట
పరిస్థితులలో ఉందని, అంతేకానీ బాబు చాణక్యత ఫెయిల్ కావడం కారణం కాదని
చెబుతున్నారు.
ప్రస్తుత పరిస్థితులలో రాజకీయ చాణక్యత కలిగిన
చంద్రబాబు కంటే మిన్న ఎవరూ లేరని అంటున్నారు. రెండు పర్యాయాలు పార్టీ
అధికారంలోకి రాకపోయినా, ఇటీవల ఉప ఎన్నికలలో వరుస ఓటములు
ఎదుర్కొంటున్నప్పటికీ బాబులో ఆత్మ విశ్వాసం ఏమాత్రం సన్నగిల్లలేదని,
కార్యకర్తలలో నిత్యం ఉత్సాహం నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని
అంటున్నారు. అలాంటి విశ్వాసం ఇతరులలో ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేమని
అంటున్నారు.
అన్నింటి కంటే ముఖ్యంగా సినీ గ్లామర్‌కు రాజకీయాలకు
సంబంధం లేదని పలుమార్లు రుజువైందని చెబుతున్నారు. ఎంతో మాస్ ఇమేజ్ కలిగిన
చిరంజీవి 2009లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాడని అందరూ భావించారని, కానీ 17
సీట్లతో సరిపెట్టుకున్నారని, అదే ఎన్నికలలో ప్రచారం చేసిన బాలయ్య,
జూనియర్‌లు కూడా టిడిపిని గట్టెక్కించ లేకపోయారని గుర్తు చేస్తున్నారు.
ఇటీవల ఉప ఎన్నికలలో కూడా చిరంజీవి మాస్ ఇమేజ్ కాంగ్రెసుకు ఉపయోగ పడలేదని,
అదే జగన్ మాత్రం అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నారని చెబుతున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి