బెంగుళూరు: అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ (ఎఎంసి) కేసులో కర్ణాటక మాజీ
మంత్రి గాలి జనార్దన్ రెడ్డి భార్య లక్ష్మీఅరుణకు సిబిఐ కోర్టు నోటీసులు
జారీ చేసింది. ఈ నెల 10వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా,
గాలి జనార్థన్‌రెడ్డికి బెంగుళూరు సిబిఐ కోర్టు ఆగష్టు 4 వరకు రిమాండ్
పొడిగించింది. ఆయన వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్ రిమాండ్‌ను కూడా పొడగిస్తూ
కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎఎంసి కేసులో గాలి జనార్దన్ రెడ్డి, అలీఖాన్
బెంగళూర్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.
అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ
(ఎఎంసి) కుంభకోణం కేసు ఎఫ్ఐఆర్‌లో సిబిఐ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్
రెడ్డి పేరునే కాకుండా ఆయన భార్య అరుణ లక్ష్మి పేరును కూడా చేర్చింది.
కర్ణాటక గనుల శాఖ మాజీ మంత్రి మునియప్ప పేరును కూడా సిబిఐ ఎఫ్ఐఆర్‌లో
చేర్చింది. ఎఎంసి గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీ.
జిందాల్
స్టీల్ వర్క్స్ వంటి కంపెనీలు ఎఎంసి నుంచి అనుమతి లేకుండా ముడి ఇనుమును
కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా వివిధ కంపెనీలకు సరఫరా
చేసిన ముడి ఇనుము పరిమాణం అక్కడ తవ్వకాలు జరిపిన పరిమాణం కన్నా ఎక్కువ
ఉంది. పరిమితికి మించి తవ్విన ముడి ఇనుమును అనంతపురం మీదుగా విశాఖపట్నం
ఓడరేవుకు తరలించిన విషయంపై కూడా సిబిఐ దర్యాప్తు చేస్తోంది.
గాలి
సోదరులు సింగపూర్‌లో మ్యాన్ -గో పబ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కొనుగోలు చేసి
గాలి లక్ష్మి అరుణ ఇంటర్నేషనల్‌గా పేరు పెట్టారు. మ్యాన్ - గో పబ్ ప్రైవేట్
లిమిటెడ్ 2004 అక్టోబర్ 28వ తేదీన రిజిష్టర్ అయింది. సింగపూర్‌కు చెందిన
అరంగన్నల్‌ను దాని డైరెక్టర్‌గా నియమించి 2007లో జిఎల్ఎగా పేరు మార్చారు.
కంపెనీ లక్ష్యాన్ని 2007 డిసెంబర్‌లో మారుస్తూ గాలి జనార్దన్ రెడ్డి
డైరెక్టర్‌గా నియమితులయ్యారు. జిజెఆర్ హోల్డింగ్స్, ఇంటర్ లింక్ సర్వీసెస్,
జిఎల్ఎ ట్రేడింగ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వ్యవహారాలపై కూడా సిబిఐ దర్యాప్తు
చేస్తోంది.
మైనింగ్ అక్రమ తవ్వకాల ద్వారా కోట్లాది రూపాయలు
సంపాదించిన గాలి ఆ డబ్బును తనతో పాటు తన భార్య పేరు మీద కూడా పెట్టినట్లు
సిబిఐ అనుమానిస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో స్థాపించిన కంపెనీల్లో ఆమెకు
ఎక్కువగా భాగస్వామ్యం ఉన్నట్లుగా భావిస్తున్నారు. గాలి అక్రమ మైనింగ్
సుమారు రూ.7500 కోట్లు ఉంటుందని సిబిఐ అంచనా వేస్తోంది. ఈ డబ్బుతో గాలి
కోట్లాది రూపాయలు, కిలోల కొద్ది బంగారాన్ని సమకూర్చుకొని ఆస్తిని తన పేరు
మీద, కుటుంబం పేరు మీద, బినామీ పేర్ల మీద పెట్టినట్లుగా తెలుస్తోంది.
ఇందులోని
చాలా వాటిలో జనార్ధన్ రెడ్డి భార్య భాగస్వామిగా ఉన్నట్లు చెబుతున్నారు.
చైనా, సింగపూర్ ఎగుమతి సంస్థలు, ఇండోనేషియా, ఆఫ్రికా దేశాలలో ఇనుప గనుల
తవ్వకాలకు స్థాపించిన కంపెనీల్లో ఆమెను భాగస్వామిగా చేర్చారనే అనుమానాలు
వ్యక్తమవుతున్నాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి