హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు
సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు పలువురు శాసనసభ్యులు చూస్తున్న
దృష్ట్యా మరోసారి రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశముందని అంటున్నారు.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల అనంతరం కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నుండి
జోరుగా జంప్‌లు ఉంటాయని భావించారు. అయితే జగన్ పార్టీ ఘన విజయం సాధించాక
కూడా రాజకీయ వాతావరణం వేడెక్కలేదు. అంతా సైలెంట్‌గానే ఉండిపోయింది. అయితే
దీనిని పలువురు తుఫాను ముందు ప్రశాంతతగా అభివర్ణించారు.
ప్రస్తుతం
నాని ఎపిసోడ్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. స్వర్గీయ నందమూరి తారక
రామారావు పుట్టిన గ్రామం ఉన్న గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే జగన్‌కు జై
కొట్టడం అందరినీ ఆశ్చరపరిచింది. గత కొన్ని రోజులుగా ఆయన జగన్ వైపు వెళతాడనే
ప్రచారం జరుగుతూనే ఉంది. అయినప్పటికీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత
సన్నిహితుడు, టిడిపికి పట్టున్న గుడివాడకు చెందిన ఎమ్మెల్యే పార్టీని
వీడటాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేక పోతున్నారు.
కొడాలి
నానిని జగన్ వైపు తీసుకు వచ్చేందుకు వంగవీటి రాధాకృష్ణ ప్రధాన పాత్ర
పోషించారని తెలుస్తోంది. మరో నేత వల్లభనేని వంశీని కూడా జగన్ వైపు
రప్పించేందుకు రాధాకృష్ణ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని అంటున్నారు. వచ్చే
సాధారణ ఎన్నికలలో జిల్లాలో టిడిపి పట్టు కోల్పోతుందని వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ నేతలు టిడిపి నేతలకు చెప్పి తమ వైపుకు రప్పించుకుంటున్నారని
అంటున్నారు. మరికొందరు నేతలు కూడా ఆయన బాట పట్టే అవకాశాలు ఉన్నాయని
అంటున్నారు.
కాంగ్రెసులో కూడా ఇప్పటికే విజయనగరం జిల్లా బొబ్బిలి
ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎమ్మెల్యే
ఆళ్ల నానిలు ఇప్పటికే రాజీనామాలు సమర్పించారు. అయితే స్పీకర్ వారి
రాజీనామాలను ఇంకా ఆమోదించలేదు. వైయస్సార్ కాంగ్రెసు నేతలు మరికొందరు
కాంగ్రెసు, టిడిపి ఎమ్మెల్యేలను తమ వైపుకు రప్పించి వారిచే రాజీనామా
చేయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
తద్వారా మరోసారి ఉప ఎన్నికలకు
దారి తీయవచ్చుననే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. వైయస్ విజయమ్మ కూడా ఇటీవల
ఎన్నికలకు ఎప్పుడైనా పార్టీ కేడర్ సిద్ధంగా ఉండాలని సూచించారు. అయితే వారి
రాజీనామాలను సభాపతి ఆమోదించాల్సి ఉంటుంది. అయితే స్పీకర్ వారి రాజీనామాలను
వెంటనే ఆమోదిస్తారా లేక గతంలో వలె కాలం సాగదీస్తారా అనే నిర్ణయంపై ఉప
ఎన్నికలు ఆధారపడి ఉన్నాయి. కొడాలి నాని త్వరలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా
చేయనున్నారని తెలుస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి