మరింత మంది కస్టమర్లను ఆకర్షించే భాగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
(ఎస్‌బిఐ) మరో ముందడుగు వేసింది. సేవింగ్స్ ఖాతాలపై 'కనీస బ్యాలెన్స్'
నిబంధనను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. గతంలో ఖాతాలో కనీసస్దాయిలో నగదు
ఉంచకపోయినా ఎలాంటి పెనాల్టీలు విధించబోమని స్టేట్ బ్యాక్ ఆఫ్ ఇండియా ఒక
ప్రకటనలో తెలిపింది. పాత కస్టమర్లకు కూడా ఈ సదుపాయం వర్తిస్తుందని, ఇకపై
సేవింగ్స్ ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా నిల్వ వుంచకుండా కొనసాగవచ్చని
పేర్కొంది.
ఒక విధంగా చెప్పాలంటే సేవింగ్స్ ఖాతాలను జీరో బ్యాలెన్స్
ఖాతాలుగా చేసినట్లేనన్నమాట. ఇప్పటివరకూ బ్యాంకు ఖాతాల్లో కనీస మొత్తంగా
1000 రూపాయలు లేకుంటే రూ 100 వరకు పెనాల్టీ విధించే వారు. అలాగే ఎస్‌బిఐలో
కొన్ని ఖాతాలకు కనీసం రూ 50 నగదు ఉంచాల్సి ఉంది. అదే ప్రైవేటు బ్యాంకులు,
విదేశీ బ్యాంకుల విషయానికి వస్తే కనీస నిల్వ మొత్తం కూడా చాలా ఎక్కువగా
ఉండమే కాకుండా పెనాల్టీలు కూడా భారీగానే ఉన్నాయి.
ప్రైవేట్
బ్యాంకులైన ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి వంటి బ్యాంకుల్లో కనీస నిల్వ మొత్తం రూ
10,000 వరకు ఉంటే సిటీ బ్యాంక్ విదేశీ ఖాతాల్లో ఇది రూ 25,000 వరకు ఉంది.
కనీస నిల్వ నిబంధనను తొలగించడం వల్ల వడ్డీ తక్కువగా ఉండే డిపాజిట్లను
సమీకరించడం సలుభమవుతుందని ఎస్‌బిఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం
ఎస్‌బిఐ సేవింగ్స్ ఖాతాపై 4% వడ్డీని అందిస్తోంది.
2011-12 ఆర్థిక
సంవత్సరంలో బ్యాంకు కొత్తగా 2.19 కోట్ల సేవింగ్స్ ఖాతాలను ప్రారంభించింది.
మార్చి 2012 నాటికి సేవింగ్స్ ఖాతాల్లో 15.39 కోట్ల రూపాయల
నిల్వలున్నాయి. ఇటీవలే హౌసింగ్ లోన్స్ పై ప్రీపేమెంట్ పెనాల్టీలు, అలాగే
ఇంటర్ బ్యాంక్ సేవలపై ఛార్జీలను ఎత్తివేస్తూ ఎస్‌బిఐ నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు కొత్తగా మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను తొలగించడంతో మిగిలిన
బ్యాంకులూ ఈ విధానాన్ని అనుసరించే అవకాశం ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి