6 ఫిబ్ర, 2012

అంతా మూడు రోజుల్లో ముగుస్తుంది: కెబినెట్‌పై సిఎం

న్యూఢిల్లీ: రాబోయే రెండు మూడు రోజుల్లో అంతా ముగుస్తుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం రాత్రి మీడియాతో అన్నారు. పూర్తి స్థాయిలో కాకపోయినా, ఉప ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రాంతం నుండి ముగ్గురిని కేబినెట్లోకి తీసుకునేందుకు అధిష్టానం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్‌లతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి నేరుగా విమానాశ్రయానికి వచ్చారు. ఈ సమయంలో ఆయనను మీడియా విస్తరణపై ప్రశ్నించింది. దానికి ఆయన స్పందిస్తూ రాబోయే రెండు మూడు రోజుల్లో అంతా ముగుస్తుందని చెప్పారు.

కాగా తెలంగాణ ప్రాంతం నేతలతో పాటు సీమాంధ్రకు చెందిన పలువురు నేతలు కూడా విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశలపై అధిష్టానం నీళ్లు చల్లిందనే చెప్పవచ్చు. సీమాంధ్ర నుండి కూడా ఒకరిద్దరికి అవకాశమిచ్చిందని కొందరు చెబుతున్నప్పటికీ, సోనియాతో భేటీ అనంతరం సీమాంధ్రకు చెందిన ఆశావహులు కొందరితో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్నా ప్రస్తుతానికి మీకు అవకాశం లేదు అని చెప్పినట్లుగా తెలుస్తోంది. సిఎం వ్యాఖ్యలను బట్టి విస్తరణ కేవలం తెలంగాణకే పరిమితమవుతుందని అర్థమవుతోంది. శనివారం రాత్రి కేవలం ఐదు నిమిషాలే సిఎంతో భేటీ అయిన సోనియా ఆదివారం సాయంత్రం మాత్రం దాదాపు గంట సేపు చర్చించారు. సోనియాను కలిసిన అనంతరం సిఎం ఉల్లాసంగా కనిపించారు. దీంతో విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అప్పుడే చాలామందికి అర్థమై పోయింది.

కామెంట్‌లు లేవు: