7 ఫిబ్ర, 2012

లోకసత్తా జెపి వ్యాఖ్యలతో చిక్కుల్లో ఐఎఎస్‍‌లు

Jayaprakash Narayanaమాజీ ఐఎఎస్ అధికారి, లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలు రాష్ట్రంలోని ఐఎఎస్ అధికారులను చిక్కుల్లో పడేస్తున్నాయి. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్, ఎమ్మార్ కుంభకోణం, వైయస్ జగన్ ఆస్తుల కేసులను విచారిస్తున్న సిబిఐపై ఐఎఎస్ అధికారులు మండిపడుతున్నారు. ఐఎఎస్ అధికారులను సిబిఐ వేధిస్తోందని వారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేశారు. అయితే, వారికి సానుభూతి అంతగా లభిస్తున్న సూచనలు కనిపించడం లేదు. జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలు వారిని మరింత ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఐఏఎస్‌లు, ఉన్నతాధికారుల పాత్ర లేకుండా రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడటం ఏమాత్రం సాధ్యపడదని ఆయన శుక్రవారం విజయవాడలో అన్నారు. అంతకన్నా తీవ్రమైన వ్యాఖ్య కూడా చేశారు. కుంభకోణాల వెనుక ఉన్న ఐఏఎస్‌లు తప్పించుకునేందుకు కుంటిసాకులు చెబుతున్నారని ఆయన విమర్శించారు. గతంలో ఐఎఎస్ అధికారిగా పలు హోదాల్లో పనిచేసిన జెపి ఆ విధమైన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుత ఐఎఎస్ అధికారులకు చేదు గుళిక మింగినట్లుగానే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. పైగా, జయప్రకాష్ నారాయణకు మంచి పేరు కూడా ఉంది. అవినీతి లేకుండా, ప్రజలకు మేలు చేసే విధంగా తన ఐఎఎస్ హోదాను వాడుకున్నారనే అభిమానం ప్రజల్లో ఉంది. 

మంత్రి వర్గం తీసుకునే నిర్ణయాలను అమలు చేసేవారమే తప్ప తమకు ఏ పాత్రా ఉండదని బుకాయించడానికి చేస్తున్న ఐఎఎస్ అధికారుల మాటలకు జెపి వ్యాఖ్యలు విరుగుడుగా పనిచేస్తున్నాయి. ఐఏఎస్‌లు నీతిగా ఉంటే రాజకీయ అవినీతిని అంతమొందించవచ్చని ఆయన చెప్పారు. నాయకులు చెప్పినట్లు చేస్తున్నామని ఐఏఎస్‌లు చెప్పటం ముమ్మాటికీ తప్పేనని ఎమ్మార్ కుంభకోణంపై ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కుంభకోణాల పాపాలను రాజకీయ నాయకుల మీదికి నెట్టడానికి ఐఎఎస్ అధికారులు ప్రయత్నిస్తున్నారనేది వారి మాటలను బట్టి స్పష్టంగానే అర్థమవుతోంది. జయప్రకాష్ నారాయణ అవినీతికి అండ కాస్తున్న ఐఎఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా అన్నారు. అసలు అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని, వారి పదవిని ఊడపీకడంతో పాటు దాని ద్వారా సంపాదించిన ఆస్తిని ప్రభుత్వపరం చేసి జైలు శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. 

ఐఎఎస్ అధికారులు నీతిపరులైతే రాజకీయ నాయకుల అవినీతిని అడ్డుకోవడానికి కూడా వీలవుతుందని ఆయన చెబుతున్నారు. అయితే, విధానపరమైన నిర్ణయాల అమలులో భాగంగా ఎక్కడైనా తప్పు జరిగితే వారిని అవినీతిపరుల జాబితాలో చేర్చకూడదన్నారు. ఐఏఎస్‌లలో కూడా నిజాయితీపరులు ఉన్నారన్నారు. టెలికం శాఖలో ఉన్నతాధికారిగా పని చేసిన ఒక ఐఏఎస్ 2జీ స్పెక్ట్రమ్ వేలం వ్యవహారాన్ని అడ్డుకున్నారని, ఆయన రిటైరయ్యాకే రాజా ఇలా చేశారని చెప్పారు. ఐఎఎస్ అధికారుల అధికారాలు, పరిధి గురించి బాగా తెలిసిన జయప్రకాష్ నారాయణ ప్రస్తుత ఐఎఎస్ అధికారుల వాదనలను కొట్టిపారేయడం వల్ల సిబిఐ విచారణకు సామంజస్యం చేకూరుతుందని అంటున్నారు.

2 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలు ఐ.ఎ.యస్ అధికారుల బుకాయింపు ధోరణిని చక్కగా యెండగట్టాయి.

అజ్ఞాత చెప్పారు...

JP వ్యాఖ్యలో కొంత నిజం వుంది. అయితే ఎంతకని IAS ప్రతిసారి అవినీతి నాయకులని తమ వున్నతిని పణగా పెట్టి అడ్డుకుంటూ వుండగలరు? వీళ్ళని విచారించే న్యాయం ఆ మంత్రులను కస్టడీలోకి ఎందుకు తీసుకోవడం లేదు? అవినీతిలో సింహభాగం ఆయా శాఖల మంత్రులదే. అంతా IASలపై నెట్టేయడం తప్పే.