5 ఫిబ్ర, 2012

మార్చి తర్వాత తెలంగాణ ఉద్యమం మరిత ఉధృతం : కేసీఆర్



మార్చి తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. అదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో పార్టీ కార్యకర్తలతో ఆయన ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దళితులపై కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు.


ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల నిధులను మళ్లించిన నీచ చరిత్ర బాబుది అని ధ్వజమెత్తారు. తెలంగాణకు అనుకూలమని చెప్పిన బాబు.. ఇపుడు మాట మార్చి ఇక్కడి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. తెలంగాణపై బాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. 

ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని ఆరోపించారు. కాంట్రాక్టు విధానాన్ని తెచ్చింది బాబేనని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని స్పష్టం చేశారు. మార్చి తర్వాత ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు.

అలాగే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రతి మండలంలో వసతి గృహంతో కూడిన రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రాంతంలో కొత్తగా 40 సింగరేటి గనులు ఏర్పాటు చేసి యాభై వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన చెప్పారు.

కామెంట్‌లు లేవు: