1 మార్చి, 2012

స్కూల్ బస్సుల ప్రమాదాలకు కారణమేంటీ?

పిల్లల్ని చేరవేసే స్కూల్ బస్సులు దారి తప్పుతున్నాయి. పొలాల్లోకి, పంట కాల్వాల్లోకి దూసుకెళ్తున్నాయి. కాకుంటే ..బోల్తా పడుతున్నాయి..లేకుంటే .ఏ చెట్టునో..మరో వాహనాన్నో ఢీకొంటున్నాయి. ఎందుకిలా జరుగుతోంది...? భవిష్యత్‌కు భరోసా ఇచ్చే పాఠశాల యాజమన్యాలకు ..బస్సుల విషయంలో నిర్లక్ష్యమెందుకు...? అసలిలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగడానికి కారణమేంటీ..? ఎంత నిర్లక్ష్యం...ఎంత అలసత్వం....పిల్లల్ని క్షేమంగా ఇంటికి తీసుకురావాల్సిన స్కూల్ బస్సు ..ఇలా కాల్వలోకి చొరబడింది. 

డ్రైవర్ కళ్లు నెత్తినపెట్టుకొని నడిపాడో ఏమో... .ఇద్దరు విద్యార్థులు జలసమాధి అయ్యారు. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సకాలంలో స్పందించడం అదృష్టమైందీ లేకపోతే మరెంత మంది తల్లిదండ్రులకు కడుపు శోకం మిగిలేదో..? ఇలాంటి ప్రమాదాలు రాష్ట్రంలో ఏదో మూల నిత్య కృత్యమయ్యాయి. మహాశివ రాత్రినాడు.... కృష్ణా జిల్లా లోని శ్రీనివాస అక్షరాలయం స్కూల్ బస్సు... శివక్షేత్రానికి వెళుతూ తాడే పల్లి దగ్గర బోల్తా పడింది. 

దేవుడి దయ వల్ల ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదు. ఈ సంఘటనపై కేసు కూడా నమోదైంది. కానీ యాజమాన్యంలో కొద్దిగా కూడా పశ్చాత్తాపం కన్పించలేదు. పైగా ఇదేంటనీ ప్రశ్నించినందుకు మీడియాపై రుసరుసలాడారు. నిబంధనలు పాటించకపోవడంవల్లే ఈ ప్రమాదాలు పదే పదే జరుగుతున్నాయంటున్నారు నిపుణులు. కాసుల కక్కుర్తితో ఒకే బస్సులో ఎక్కువ మంది పిల్లల్ని ఎక్కించడం, డ్రైవింగ్ సరిగా తెలియని వాళ్లను డ్రైవర్లుగా పెట్టుకోవడంతో యాక్సిడెంట్ల సంఖ్య పెరుగుతోందంటున్నారు. 

అంతేకాదు పాత డొక్కు వాహనాలకు ..కలర్లేసి...కొత్తవాటిలా కవరింగ్‌ ఇస్తూ రోడ్లపై తిప్పుతున్నారంటున్నారు. ఇదే యాక్సిడెంట్లకు ప్రధాన కారణమంటున్నారు. రూల్స్ బ్రేక్ చేసే యాజమన్యాల తాట తీయాల్సిన అధికారులు...మాముళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే పసిమొగ్గల ప్రాణాలకు ముప్పు తెస్తోందనేది చాలా మంది అభిప్రాయం. ఇప్పటికైనా తోకజాడించే వారి తోక కత్తిరించాలని..లేకపోతే తూర్పుగోదావరి ఘటనలు మళ్లీ మళ్లీ జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కామెంట్‌లు లేవు: