3 మార్చి, 2012

చిరునవ్వుతో మరింత యవ్వనం : పరిశోధనలో వెల్లడి

నవ్వుతూ బతకాలిరా అంటూ మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఇప్పుడు తాజాగా పరిశోధకులూ ఇదే మాట చెపుతున్నారు. "ఒక నవ్వు చాలు.. మీరు మరింత యవ్వనంగా కనిపించడానికి.." అంటున్నారు. జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ మానవాభివృద్ధి సంస్థ పరిశోథకులు నవ్వుపై ప్రత్యేక పరిశోథనలు చేసారు. 

నవ్వుతూ ఉన్న వ్యక్తుల ఫోటోలను ఎవరయినా చూసినపుడు, ఆయా వ్యక్తుల అసలు వయసు కన్నా ఫోటోల్లో మరింత వయసు తక్కువగా అందంగా కనిపించడాన్ని వారు కనుగొన్నారు. ఆయా వ్యక్తులను కోపంతో ఉన్నపుడు కానీ, మామూలుగా ఎటువంటి హావభావాలు లేకుండా ఉన్నపుడు కానీ ఫోటోలను తీసినపుడు వారి వయసు భిన్నంగా అనిపించింది. నిజానికి మన ముఖ కవళికలను మార్చడం ద్వారా ఆయా ఫోటోల్లో వయసు తక్కువగా కనిపించనూ వచ్చు.. ఎక్కువగా కూడా కనిపించవచ్చు. 

నవ్వేటపుడు మన కళ్ళ దగ్గర, నోటి దగ్గర తాత్కాలికంగా చిన్న చిన్న ముడతలు(వయసు మీద పడినపుడు ఏర్పడే ముడతల్లాంటివి కాదు) పడతాయి. ఆ ముడతలే చాలామందిని ఫోటోల్లో వయసు తక్కువగా కనిపించేలా చేస్తాయి. ఒకోసారి ఆ అందమయిన ముడతలే ఎదుటివారిని వయసు విషయంలో పొరపడేలా చేయవచ్చు. ఫేస్‌బుక్, ఫ్లికర్ లాంటి సామాజిక సైట్లలో నెటిజన్లు పెట్టే చిరునవ్వుల ఫోటోలు ఈ తరహావే. 

తమ పరిశోథనలో భాగంగా, పరిశోథకులు కొంత మంది ఔత్సాహికులకు వివిధ రకాల హావభావాలతో ఉన్న 171 మంది పురుషులు, మహిళల ఫోటోలను చూపించారు. ఆయా వ్యక్తులు కోపంగానో, భయంతోనో లేదా ఆందోళన చెందుతున్నట్లు, విసిగి వేసారినట్లు, ఆనందంగా ఉన్నట్లు, ఎటువంటి భావాలు లేకుండా ఉన్న ఫోటోలను చూపారు. 

నవ్వుతూ ఉన్న ఫోటోలను చూసిన ఔత్సాహికులు ఆయా వ్యక్తుల వయసును తక్కువగా ఊహించారు. అయితే, ఎటువంటి హావభావాలు లేకుండా ఉన్న వ్యక్తుల ఫోటోలను చూసిన ఔత్సాహికులు వ్యక్తుల అసలు వయసును కొంచెం అటూఇటుగా సరిగ్గా ఊహించగలిగారు.

కామెంట్‌లు లేవు: