3 మార్చి, 2012

షారుఖ్‌ను ప్రశ్నించిన లండన్ పోలీసులు: కారులో ఉడాయించిన డాన్

                         


డాన్' షారూఖ్‌ ఖాన్‌ను లండన్ పోలీసులు ప్రశ్నించారు. అతని కారును కూడా పూర్తిగా సోదా చేసారు. బారత్‌లో టాప్‌స్టార్ అన్న విషయాన్ని కూడా కనీసం పట్టించుకోకుండా ప్రశ్నలమీద ప్రశ్నలు సంధించారు. ఇదంతా ఎక్కడో జరగలేదు. సాక్షాత్తు షారుఖ్ పాల్గొంటున్న షూటింగ్ స్పాట్‌లోనే జరిగింది. 

వివరాల్లోకి వెళితే... యాష్ చోప్రా బ్యానర్‌పై త్వరలో రాబోతున్న భారీ చిత్రంలో నటిస్తున్న షారూఖ్‌ ఖాన్‌పై దృశ్యాల చిత్రీకరణ లండన్లో జరుగుతోంది. కత్రినా కైఫ్, అనుష్కాశర్మలు ఈ సినిమాలో హీరోయిన్లు. నిజానికి, యాష్ చోప్రా బ్యానర్ అనగానే, సినిమా షూటింగ్ వ్యవహారాల విషయంలో ఎంత కట్టుదిట్టంగా ఉంటుందో వేరే చెప్పనక్కరలేదు. 

సినిమా విడుదలయ్యే వరకూ దానికి సంబంధించిన ఎటువంటి సమాచారమూ బయటకు లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని ఆ సంస్థకు పేరు. అందులో భాగంగానే నిర్మాతలు సినిమా షూటింగ్ జరుగుతున్న పరిసరాల్లో భారీ ఎత్తున లండన్ పోలీసుల సహకారాన్ని తీసుకున్నారు. 

షూటింగ్ సమయంలో ఎవరయినా అనధికారికంగా తమ సెల్ ఫోన్ల నుండి ఏమయినా దృశ్యాలను చిత్రీకరించి వాటిని ఆన్‌లైన్లో లీక్ చేయకుండా చూడటంతో పాటు వచ్చేపోయే వారిని నిలువెల్లా సోదా చేయడం వారి డ్యూటి. అందులో భాగంగానే కొన్నిరోజుల క్రితం, షూటింగ్‌ ముగించుకుని బయటకు వెళ్తున్న షారుఖ్ కారును పోలీసులు ఆపేసారు. పలు రకాల ప్రశ్నలు సంధించారు (అయితే ఆ ప్రశ్నలేమిటనేది బయటకు రాలేదు). వాటికి షారుఖ్ ఓపిగ్గానే బదులిచ్చాడు. 

అయితే, తర్వాత ఏమయిందో కానీ, పోలీసులకు, షారుఖ్‌కు మధ్య కొంత వాదన కూడా చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అనంతరం, పోలీసులు ఆపడానికి ముందు వెళ్లడానికి ప్రయత్నించిన కారును పోలీసుల దగ్గరే వదిలేసి వేరొక కారులో 'డాన్' వేగంగా వెళ్లిపోయాడు. మ్యాటర్ ఏమిటనేదే సస్పెన్స్‌గా ఉంది.

కామెంట్‌లు లేవు: