4 మార్చి, 2012

అర్ధరాత్రి జగన్ ఇంటి వద్ద హడావుడి, అరెస్టుపై ప్రచారం?

                                        ys jagan


హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ముందు శనివారం అర్ధరాత్రి హడావుడి కనిపించిందని ఓ పత్రికలో వచ్చింది. శనివారం రాత్రి తొమ్మిది గంటలకు సుమారు 40 మంది జగన్ నివాసానికి చేరుకున్నారని, సమయం గడుస్తున్న కొద్దీ, వస్తున్న జనం సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందని, అర్ధరాత్రి ఒంటి గంట అయ్యేసరికి అక్కడికి దాదాపు 600 మంది వరకు చేరుకున్నారని అందులో పేర్కొన్నారు. అక్రమ ఆస్తుల కేసులో జగన్‌ను సిబిఐ అరెస్టు చేసే అవకాశం ఉందన్న సమాచారం వారికి అందడమే ఈ హడావుడికి కారణమని తెలిసిందని పేర్కొంది. జగన్ ఇంటికి చేరుకున్న మద్దతుదారులు హల్‌చల్ సృష్టించారని, జగన్ ఇంటికి చేరుకునే నాలుగు దారుల్లోనూ రాకపోకలను అడ్డుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలిపింది. వాహనాలనే బ్యారికేడ్లుగా మార్చి రోడ్డుకు అడ్డంగా నిలబెట్టారని, ఆ మార్గంలోని వీధిలైట్లను ఆర్పేశారని పేర్కొంది.

మరోవైపు, జగన్‌ను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందని, అందువల్ల, ఆయన ఇంటి వద్దకు చేరుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన మద్దతుదారులకు ఎస్ఎంఎస్‌లు పంపుతున్నట్లు తెలిసిందని పేర్కొంది. ముఖ్యంగా మహిళలను పెద్దఎత్తున తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారముందని రాసింది. కాగా, జగన్ అక్రమాస్తుల కేసులో చార్జిషీటు దాఖలు చేసేందుకు గడువు దగ్గర పడుతుండటంతో ముఖ్యమైన నిందితుల అరెస్టుకు సిబిఐ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తొందని రాసింది. ఈ కేసులో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలంటూ జగన్‌తోపాటు మరికొందరు ముఖ్యులకు సిబిఐ నుంచి త్వరలో శ్రీముఖాలు అందనున్నట్లు తెలుస్తోందని పేర్కొంది. కాగా అర్ధరాత్రి తన ఇంటి వద్దకు వచ్చిన అభిమానులకు జగన్ బయటకు వచ్చి అభివాదం చేసినట్లుగా తెలుస్తోంది.

కామెంట్‌లు లేవు: