19 జూన్, 2012

విద్యార్థులపై నుండి దూసుకెళ్లిన బస్సు, ఒకరి మృతి





















హైదరాబాద్: ఇటీవల వరుస ప్రమాదాల నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తుండగానే ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. మంగళవారం ఉదయం హైదరాబాదులో ఓ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాదులోని నారాయణగూడలోని పోలీస్ స్టేషన్ దగ్గరలో ఈ ప్రమాదం జరిగింది.

నారాయణ కళాశాలలో ఇంటర్మీడియేట్ చదువుతున్న అతుల్ లోయ, గోవింద్ జాజులు హోండా యాక్టివాపై కళాశాలకు వెళుతున్నారు. వారు కోఠి నుండి నారాయణగూడ వైపు వెళ్తున్నారు. ఈ సమయంలో వారి ముందు ఉన్న వాహనంలోని ఓ పోలీసు అనుకోకుండా వాహనం డోర్ తెరిచారని సమాచారం. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా బ్రేక్ వేశారు. వారు వాహనం పై నుండి కింద పడ్డారు.

దీంతో అటు వైపు నుండి వెళ్తున్న ఓ ఆర్టీసి బస్సు వీరిపై నుండి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అతుల్ అక్కడికక్కడే మృతి చెందగా, గోవింద్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. తోటి విద్యార్థులు, స్థానికులు గోవింద్‌ను చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం విద్యార్థులు అందరూ నారాయణగూడ పోలీసు స్టేషన్ ముందు బైఠాయించారు.

వాహనం డోరు హఠాత్తుగా తెరిచిన పోలీసును వెంటనే సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని విద్యార్థులు ఆందోళన చేశారు. పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. అయితే విద్యార్థుల మాత్రం పోలీసును అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ ఘటన ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో జరిగింది. మృతుడు మలక్‌పేట వాసి.

కామెంట్‌లు లేవు: