హైదరాబాద్: కృష్ణా జిల్లా గుడివాడ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కొడాలి
నాని సోమవారం సాయంత్రం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో భేటీ
అయ్యారు. నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు
సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్లనున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆయన
బాబును కలవడం ప్రధాన్యత సంతరించుకుంది. తనకు పార్టీ వీడే ఆలోచన లేదని
బాబుకు నాని చెప్పారు.
బాబుతో భేటీ అనంతరం ఆయన పలువురు పార్టీ నేతలతో
మాట్లాడుతూ.. తనకు పార్టీ వీడే ఆలోచన లేదని చంద్రబాబుకు స్పష్టం చేశానని
చెప్పారు. తాను తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో
జాయిన్ అవుతున్నట్లు వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేశారు.
తాను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు.
కాగా వారం
వ్యవధిలో నాని బాబును కలవడం ఇది రెండోసారి. ఉప ఎన్నికల పోలింగ్ రోజు ఆయన
చంద్రబాబుతో రెండు గంటల పాటు సమావేశమయ్యారు. కానీ, ఉప ఫలితాలు వెలువడిన
రోజు గుడివాడలో జగన్ చిత్రం, నాని చిత్రం ఉన్న ఫ్లెక్సీలు వెలవడం కలకలం
రేపింది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యుడు యలమంచిలి బాబూ
రాజేంద్ర ప్రసాద్ నానిని బాబు వద్దకు తీసుకువెళ్ళారు.
జగన్ సామాజిక వర్గానికి చెందిన
కొందరు యువకులు వాటిని పెట్టారని, తాను వారికి నచ్చచెప్పి తీసేయించానని
నాని చెప్పారు. బాబును కలిసిన తర్వాత నాని జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా కలిసి
మాట్లాడారు. కాగా ఇటీవల విజయవాడ పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వంశీ విషయంలోనూ
ఇలాంటి గందరగోళం చెలరేగింది. అయితే ఆయన కూడా బాబుకు వివరణతో కూడిన లేఖను
రాయడంతో పరిస్థితి సద్దుమణిగింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి