19 జూన్, 2012

'చిరు'తో లాభం లేదా లేక పిఆర్పీతో కుదరకనా?




















ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో అధికార కాంగ్రెసు పార్టీ ఘోర పరాజయం చవి చూసింది. దీంతో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ విలీనమైనా ఎలాంటి ఫలితం కనిపించడం లేదని కొందరు అంటుండగా మరికొందరు మాత్రం విలీన ప్రభావం లేక కాదని, సమన్వయం లేకే అంటున్నారు. 18 నియోజకవర్గాలలో జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెసు కేవలం రెండుచోట్ల మాత్రమే గెలుపొంది.. మిగిలిన చోట్ల దారుణమైన పరాభవం మూటకట్టుకుంది.

గతంలో జరిగిన కొవూరు ఉప ఎన్నిక, కడప, పులివెందుల ఉప ఎన్నికలలోనూ కాంగ్రెసు పార్టీ దారుణమైన పరాజయం పాలైంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టేందుకు చిరంజీవిని తమ దరికి చేర్చుకున్నప్పటికీ లాభం లేక పోయిందని కొందరు కాంగ్రెసు నేతలు వాపోతున్నారట. కాంగ్రెసు గతంలో కంటే దారుణంగా ఓట్ల శాతాన్ని కోల్పోయిందని, జగన్ బయటకు వెళ్లడంతో చిరంజీవితో దానిని పూడ్చుకోవచ్చని భావించినప్పటికీ ఫలితాల సరళి చూస్తుంటే మాత్రం పిఆర్పీ విలీనం వల్ల ఒరిగిందేమీ లేదనే వ్యాఖ్యానిస్తున్నారట.

అయితే పిఆర్పీ నేతలు కూడా అందుకు కౌంటర్ రెడీ చేసుకుంటున్నారని అంటున్నారు. కాంగ్రెసులో విలీనమైన పిఆర్పీ వర్గంతో కిందిస్థాయిలో సరైన రీతిలో సమన్వయం చేసుకోకపోవడం వల్లనే ఉప ఎన్నికలలో ఓటమికి ప్రధాన కారణమని చిరు వర్గం నేతలు(మాజీ పిఆర్పీ నేతలు) విశ్లేషిస్తున్నారు. సమన్వయమున్న రామచంద్రాపురం, నరసాపురంలలో విజయం సాధ్యమైందని వారు చెబుతున్నారు.

మిగిలినచోట్ల కూడా అలాంటి సమన్వయం ఉంటే మరికొన్ని స్థానాలలో గెలుపొందే వారమని చెబుతున్నారు. పిఆర్పీ యంత్రాంగాన్ని కాంగ్రెసు నాయకులు సరైన రీతిలో సమన్వయం చేసుకొని పోవడం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి కాంగ్రెసులోకి రావడంతో వివిధ వర్గాలు, అభిమానులు, అన్నింటికి మించి బలమైన సామాజిక వర్గం అండదండలు లభించినా.. దానిని సద్వినియోగం చేసుకోవడంలో కాంగ్రెసు నేతలు విఫలమయ్యారని భావిస్తున్నారని తెలుస్తోంది.

రాయలసీమలో ఒక వర్గం వైయస్సార్ కాంగ్రెసుతో నడిచే పరిస్థితి ఉన్నప్పుడు... చిరంజీవి రాకతో లభించిన మరో వర్గం అండదండల్ని సంపూర్ణంగా ఉపయోగించుకునేలా కాంగ్రెసు వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయిందని అభిప్రాయాపడుతున్నారు. రాజంపేట, అనంతపురం, రాయచోటి నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపికే దీనికి ఉదాహణ అని చెబుతున్నారు. రాయలసీమలోని ఏడు జనరల్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే టిడిపి నాలుగింటిలో ఆ వర్గానికి అవకాశమిచ్చిందని, దీంతో అక్కడ కాంగ్రెసు తీవ్రంగా నష్టపోయిందని భావిస్తున్నారట.
ఉప ఎన్నికలలో గెలిచిన తోట త్రిమూర్తులు, కొత్తపల్లి సుబ్బారాయుడు తనను గెలిచిన సమయంలో రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సోమవారం మాట్లాడాతూ... పిఆర్పీ, కాంగ్రెసు శ్రేణుల మధ్య చక్కటి సమన్వయం సాధించిన వీరిద్దరు గెలిచారని అభిప్రాయపడ్డారు. ఇదే పరిస్థితి మిగిలిన చోట్ల కూడా ఉంటే గెలుపు సాధ్యమయ్యేదని అన్నారు. ఓటమికి పలు ఇతర కారణాలతో ఇది కూడా కారణమని చెప్పారు. పిఆర్పీ విలీనమై ఇన్ని రోజులైనా స్థానికంగా రెండు పార్టీల మధ్య సమన్వయం లేకపోవడం నష్టం చేకూరుస్తుందని పలువురు కాంగ్రెసు నేతలు కూడా అంగీకరిస్తున్నారు.

కామెంట్‌లు లేవు: