మంత్రి ధర్మాన ప్రసాద రావు తనయుడు రామ్మనోహర్ నాయుడును ఎసిబి(అవినీతి
నిరోధక శాఖ) అధికారులు సోమవారం ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ
మద్యం సిండికేటు నుండి రామ్మనోహర్ నాయుడు ముడుపులు తీసుకున్నట్లుగా
ఆరోపణలు ఉన్నాయి. ఎసిబి అధికారులు అతనిని మూడు గంటలు ప్రశ్నించారు. అనంతరం
ఆయన విలేకరులతో మాట్లాడారు.
మద్యం వ్యాపారంతో తనకుగానీ తన కుటుంబ
సభ్యులకు గానీ సంబంధం లేదని చెప్పారు. గ్రానైట్ వ్యాపారం చేసుకుంటున్న
తనను ఎసిబి అధికారులు పొరపాటున పిలిచారని తెలిపారు. కొన్ని సందేహాల
నివృత్తికే మంత్రి కుమారుడు చిన్నీని ప్రశ్నించామని ఎసిబి డిఎస్పీ
వెంకటేశ్వర రావు తెలిపారు. వ్యాపార నిర్వహణలో భాగంగా చిన్నీ అనే వ్యక్తికి
ముడుపులు చెల్లించినట్టు రికార్డుల్లో వున్నమాట వాస్తవమేనన్నారు.
తాము
అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి విచారణకు ఆయన సహకరించారన్నారు. కాగా
మద్యం సిండికేట్ల నుండి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పలువురు
ప్రజాప్రతినిధులు వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో ఎసిబి ముందు ఈ నెల 18
నుండి 20 వరకు హాజరు కానున్న విషయం తెలిసిందే.
మహబూబ్ నగర్
ఎమ్మెల్యే కవిత, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ
పువ్వాడ నాగేశ్వర రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున తాజాగా గెలిచిన
ధర్మాన కృష్ణదాసు, చెన్నకేశవ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. ఈ మూడు
రోజులలో వారు ఎసిబి ముందు హాజరై వివరణ ఇవ్వనున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి