22 జూన్, 2012

భారీ పోలీస్ భద్రత మధ్య పవన్ కళ్యాణ్ షూటింగ్





















పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ప్రస్తుతం అమీర్ పేటలోని సారథి స్టూడియోలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ రూ. 3 కోట్లతో వేసిన టీవీ ఛానల్ స్టూడియో సెట్‌లో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. జూన్ 15న ఇక్కడ షూటింగ్ ప్రారంభం అయింది.

తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకరైన పవర్ స్టార్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. సిటీ మధ్యలోనే షూటింగ్ జరుగుతుండటంతో ఈ విషయం తెలిసిన వారంతా సారథి స్టూడియో వైపు వస్తుండటంతో అమీర్ పేట చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. కొందరు అభిమానులు ప్రమాదాన్ని లెక్కచేయకుండా సారథి స్టూడియో కాంపౌండ్ వాల్ ఎక్కేస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు పవన్ కళ్యాణ్ షూటింగుకు భారీగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా, కాంపౌండ్ వాల్ ఎక్కి ఎవరూ లోనికి వెళ్లకుండా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సారథి స్టూడియోకు సంబంధించిన ప్రవేట్ సెక్యూరిటీకి అభిమానుల తాకిడిని ఆపడం సాధ్యం కాక పోవడంతో స్టూడియో వారే పోలీసుల సహాయం కోరినట్లు తెలుస్తోంది.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కెమురామెన్ గంగంతో రాంబాబు' చిత్రంలో పవన్ సరసన తమన్నా నటిస్తోంది. ఈ చిత్రంలో పవర్ స్టార్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించబోతున్నారు. పూరి-పవన్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘బద్రి' చిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని డివివి దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

కామెంట్‌లు లేవు: