హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా
లోకేష్ పేరు వెనక్కి పోయింది. ఇటీవల నారా లోకేష్ రాజకీయ ఆరంగేట్రంపై
జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. పలువురు పార్టీ నేతలు కూడా భేటీలలో
లోకేష్‌ను రాజకీయాలలోకి తీసుకు రావాలని బాబుకు సూచించారు. చిత్తూరు జిల్లా
చంద్రగిరి నియోజకవర్గం తెలుగు యువత నేతలు కూడా లోకేష్‌కు తెలుగు యువత
అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించాలని బాబుకు లేఖ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.
వారి
సూచనల మేరకు యువతను పార్టీ వైపు మరల్చేందుకు ఓ యువనేత అవసరమని చంద్రబాబు
కూడా భావించారని, అందుకు అనుగుణంగా తన తనయుడు లోకేష్ రాజకీయ ఆరంగేట్రంపై
ప్రకటన చేసేందుకు సిద్దపడ్డారనే వాదనలు వినిపించాయి. అయితే రెండు రోజులుగా
పార్టీలో వచ్చిన కుదుపు దృష్ట్యా లోకేష్ రాజకీయ ఆరంగేట్రంపై బాబుతో పాటు
పార్టీ నేతలు కూడా ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తున్నారని
అంటున్నారు.
కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని పార్టీ
వీడడానికి పలు కారణాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
2014లో బాలయ్య గుడివాడ నుండి పోటీ చేసే అవకాశాలు ఉండటం, నియోజకవర్గంలో
బలహీనవర్గాలు జగన్ పార్టీ వైపు మొగ్గు చూపడం వంటి తదితర కారణాలతో పాటు తనకు
అత్యంత సన్నిహితుడు అయిన హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడప్పుడే రాజకీయాలలోకి
వచ్చే పరిస్థితులు కనిపించడం లేకపోవడం కూడా మరో కారణమంటున్నారు.
ఇప్పటికే
చంద్రబాబు పార్టీలో తనకు శత్రువు అయిన దేవినేని ఉమా మహేశ్వర రావును
ప్రోత్సహిస్తున్నారని, లోకేష్ కూడా రంగ ప్రవేశం చేస్తే తన రాజకీయ
భవిష్యత్తుకే ప్రమాదమని భావించిన నాని జగన్‌కు జై కొట్టారని అంటున్నారు.
ఆయన అభిప్రాయం ఏదైనప్పటికీ.. పార్టీలో మరోసారి ముసలం పుట్టిన ఇలాంటి సమయంలో
లోకేష్ ఆరంగేట్రంపై మాట్లాడక పోవడమే మంచిదనే అభిప్రాయంలో తెలుగు తమ్ముళ్లు
ఉన్నారని అంటున్నారు.
సోమవారం జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్ రాజకీయ
ఆరంగేట్రంపై స్పందించమని విలేకరులు అడిగినప్పుడు.. యువత రాజకీయాలలోకి
రావాలని చెప్పానే కానీ తాను వస్తానని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. అంతేకానీ
లోకేష్ గురించి మాత్రం ప్రస్తావించలేదు. ఆయన వ్యాఖ్యలలో అసంతృప్తి కాస్తో
కూస్తో కొట్టొచ్చినట్లుగా కనిపించిందని అంటున్నారు. నాని బయటకు
వెళ్లినప్పటికీ ఎన్టీఆర్ టిడిపితోనే ఉంటానని చెప్పారని, ఇలాంటి
పరిస్థితులలో ఎన్టీఆర్ వర్గంలో మరింత అసంతృప్తి రగుల్చకుండా ఉండాలంటే
లోకేష్ ఆరంగేట్రంపై మాట్లాడకుండా ఉండటమే మంచిదని భావిస్తున్నారని
అంటున్నారు.
ఇప్పటికే కొడాలి నాని తర్వాత వల్లభనేని వంశీ క్యూలో
ఉన్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి
వెళ్లడానికి కారణమైన వంగవీటి రాధాకృష్ణ ఇప్పుడు వంశీని పార్టీలోకి తెచ్చే
అంశంపై దృష్టి సారించారని అంటున్నారు. ఎన్టీఆర్ వర్గం ఇప్పటికే చాలా
అసంతృప్తితో ఉందని, ప్రస్తుతం వారు నివురు గప్పిన నిప్పులా ఉన్నారని
కాబట్టి లోకేష్ పేరును తీసుకు వచ్చి వారిని మరింత రెచ్చగొట్టక పోవడమే
మంచిదని అభిప్రాయపడుతున్నారట.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి