12 జులై, 2012

చంద్రబాబు వ్యూహం: జూ. ఎన్టీఆర్ ఒంటరి?



















సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను ఒంటరి చేసే వ్యూహం తెలుగుదేశం పార్టీలో సాగుతున్నట్లు తెలుస్తోంది. ఆయన తండ్రి నందమూరి హరికృష్ణను, జూనియర్ ఎన్టీఆర్‌ను ఆత్మరక్షణలో పడేసే పద్ధతిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ విజయవాడ నాయకుడు వల్లభనేని వంశీ వ్యవహారంతో జూనియర్ ఎన్టీఆర్ ఇరకాటంలో పడ్డారు. ఇప్పుడు కొడాలి నాని ఉదంతం ఆయనకు తీవ్రమైన ఇబ్బందినే తెచ్చిపెట్టినట్లు చెబుతున్నారు. తన వర్గానికి చెందిన నాయకులకు పార్టీలో తగిన స్థానం కల్పించగలననే హామీ ఇవ్వలేని స్థితిలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.

తాను ఏమీ చేయలేని స్థితిలోనే కొడాలి నాని నిర్ణయాన్ని జూనియర్ ఎన్టీఆర్ కాదనలేకపోయారని చెబుతున్నారు. కొడాలి నాని పార్టీని వీడిపోవడంపై మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు - ఆయన సమస్యలు ఏవో ఆయనకు ఉన్నాయని జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి మాట చంద్రబాబు వద్ద సాగడం లేదని జూనియర్ ఎన్టీఆర్ గుర్తించినట్లు చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీలో తాను ఒంటరిని అయిపోతున్న భావన జూనియర్ ఎన్టీఆర్‌కు కలిగిందని అంటున్నారు. అందుకే నాని వైయస్ జగన్ పార్టీలో చేరడం వెనక తన పాత్ర లేదని చెప్పారు. ఆ రకంగా ఆత్మరక్షణ వైఖరి ప్రదర్శించారు. ఎన్టీ రామారావు అభిమానులు తనకు దూరమవుతారనే ఉద్దేశంతోనే ఆయన సర్దిచెప్పుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారని అంటారు.

స్వర్గీయ ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి పీఠం నుంచి దించే సమయంలో తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు, నందమూరి హరికృష్ణ చంద్రబాబు వెంట ఉన్నారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తర్వాత చంద్రబాబు వారిద్దరిని పక్కన పెట్టారనే అభిప్రాయం ఉంది. అదే రీతిలో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పట్ల వ్యవహరిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. పార్టీలో ఇమడలేక తమంత తాము ఏదో తీవ్రమైన నిర్ణయం తీసుకునే వైపుగా చంద్రబాబు జూనియర్ ఎన్టీర్‌ను నెడుతున్నట్లు చెబుతున్నారు.

కామెంట్‌లు లేవు: